Dhaba Style Paneer Curry : మనకు ధాబాలల్లో లభించే వివిధ రకాల రుచికరమైన కూరలల్లో పనీర్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పనీర్ తో చేసే ఈ కర్రీని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కర్రీని రైస్, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పనీర్ కర్రీని అదే రుచితో అంతే కమ్మగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా పనీర్ తో రుచికరమైన కర్రీని తయారు చేసుకుని తీసుకోవచ్చు. ధాబా స్టైల్ పనీర్ కర్రీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, కారం- ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, పీర్ – 200 గ్రా., నీళ్లు – ఒకటిన్నర కప్పు, ప్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, కసూరి మెంతి – అర టేబుల్ స్పూన్.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, జీడిపప్పు – 5, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్.
ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా మసాలా పేస్ట్ ను తయారు చేసుకోవడానికి గానూ కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్లకు, టమాటాలు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత స్టవ్ ఆప్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో బటర్, నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బఠాణీ, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత పనీర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మరో టేబుల్ స్పూన్ బటర్, క్రీమ్ వేసి కలపాలి. తరువాత కసూరిమెంతి వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పనీర్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.