Aloo Mirchi Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. మిర్చి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారని చెప్పడంలో వీటిని రుచి చూడని వారు ఉండరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీటిని ఇంట్లో కూడా మనం విరివిగా తయారు చేస్తూ ఉంటాము. అలాగే మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బజ్జీ మిర్చీలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఆలూ మిర్చి బజ్జీలు కూడా ఒకటి. ఆలూ స్టఫింగ్ తో చేసే మిర్చి బజ్జీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్రిస్పీగా, మరింత రుచిగా ఉండే ఈ ఆలూ మిర్చి బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మిర్చి బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బజ్జీ మిరపకాయలు – 8, శనగపిండి – అర కప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వాము – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ మిక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్.
ఆలూ మిర్చి బజ్జీ తయారీ విధానం..
ముందగా ఒక గిన్నెలో బంగాళాదుంపలను మెత్తగా చేసి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత బజ్జీ మిర్చిలను తీసుకుని వాటికి గాట్లు పెట్టి లోపల ఉండే గింజలను తీసివేయాలి. తరువాత తయారు చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని మిర్చిలల్లో స్టఫ్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్టఫ్ చేసుకున్న మిరపకాయలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మిర్చి బజ్జీలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలారుచిగా ఉంటాయి. తరుచూ ఒకేరకం బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.