మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశలు కూడా ఒకటి. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మందికి దోశలు ఫేవరేట్ ఫుడ్ అని చెప్పవచ్చు. దోశలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తయారు చేసుకోవడానికి ముందు రోజే పిండిని సిద్దం చేసుకోవాలి. ఇలా పిండిని ముందే రోజే తయారు చేసే పని లేకుండా అప్పటికప్పుడు కూడా ఎంతో రుచికరమైన దోశలను తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ దోశలకు పప్పు నానబెట్టి, రుబ్బే పనే లేదు. కేవలం 20 నిమిషాల్లో ఇన్ స్టాంట్ గా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. పప్పు నానబెట్టి రుబ్బే పనిలేకుండా ఇన్ స్టాంట్ గా రుచికరమైన దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – ముప్పావు కప్పు, గోధుమపిండి – అర కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, పెరుగు – అర కప్పు, పంచదార – పావు టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రవ్వను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే గోధుమపిండి, బియ్యంపిండి, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి దోశపిండి లాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో పంచదార, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పిండి చక్కగా నానిన తరువాత పిండిని మరోసారి అంతా కలుపుకుని వేడి వేడి పెనం మీద దోశలాగా వేసుకోవాలి. దీనిని నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ దోశ తయారవుతుంది. ఈ దోశపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను చల్లుకుని ఉల్లిదోశ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మసాలా దోశ, కారం దోశ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన ఈ ఇన్ స్టాంట్ దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.