Varige Buvva : మనకు లభించే చిరుధాన్యాల్లో వరిగెలు కూడా ఒకటి. వరిగెలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.ఎక్కువగా వీటితో అన్నాన్ని వండుకుని తింటారు. వరిగె అన్నం రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వరిగెలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మనం సులభంగా బరువు తగ్గవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా వరిగెలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరుచూ తెల్లబియ్యంతోనే కాకుండా ఇలా వరిగెలతో అన్నాన్ని వండుకుని తినడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. వరిగెలతో అన్నాన్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వరిగె బువ్వ తయారీకి కావల్సిన పదార్థాలు..
వరిగెలు – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు.
వరిగె బువ్వ తయారీ విధానం..
ముందుగా ఒక కుండలో వరిగెలను వేసి శుభ్రంగా కడగాలి. తరువాత రెండున్నర కప్పులు నీళ్లు పోసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ కుండను అలాగే స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. వరిగెలు ఉడికి నీళ్లు తగ్గిన తరువాత మూత పెట్టి చిన్న మంటపై పూర్తిగా ఉడికించాలి. వరిగెలు ఉడికి ఆవిరి పోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. దీనిని పప్పుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వరిగెలతో అన్నాన్ని వండకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.