మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో.. మనకు నిద్ర కూడా అంతే అవసరం. అలాగే రోజూ వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. అయితే వ్యాయామం విషయానికి వస్తేనే చాలా మంది ససేమిరా అంటుంటారు. రోజూ వ్యాయామం చేసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ వాస్తవానికి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అయితే భారీ వ్యాయామాలు చేయాల్సిన పనిలేదు. రోజూ వాకింగ్ చేసినా చాలు. బరువు తగ్గవచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలు మనకు వాకింగ్ వల్ల కలుగుతాయి. అయితే అధిక బరువు తగ్గాలంటే రోజూ కనీసం ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వారానికి మనకు తప్పనిసరిగా 150 నిమిషాల వ్యాయామం అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారంలో 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. దీంతో వారం కోటా 150 నిమిషాలు పూర్తవుతుంది. ఇక ఇవే నిమిషాల పాటు భారీ వ్యాయామాలు చేయాల్సిన పనిలేదని, కేవలం వాకింగ్ చేసినా చాలని.. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే సుమారుగా 100 నుంచి 150 క్యాలరీల వరకు శక్తి ఖర్చవుతుంది. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి, భారీ వ్యాయామాలు చేయలేమని అనుకునేవారికి వాకింగ్ అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. తేలికపాటి నడకతో అనేక రోగాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఓపిక ఉంది అనుకునేవారు రోజూ గంట సేపు అయినా వాకింగ్ చేయవచ్చు. వాకింగ్‌కు అలవాటు పడితే నిదానంగా వేగాన్ని పెంచుతూ పోవచ్చు. దీంతో బరువు త్వరగా తగ్గుతారు. అలాగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.
రోజూ వాకింగ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. పొట్ట, తొడల వద్ద ఉండే కొవ్వు కరిగిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఈ విధంగా రోజూ వాకింగ్ చేయడం వల్ల మనం అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ వాకింగ్ చేయడం మరిచిపోకండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి.