Chinthakaya Pachi Pulusu : మనం చింతపండునే కాకుండా పచ్చిచింతకాయలను కూడా వంట్లలో వాడుతూ ఉంటాము. పచ్చళ్లల్లో, చారు, సాంబార్ వంటి వాటిలో పులుపు కొరకు పచ్చి చింతకాయలను వాడుతూ ఉంటాము. ఇలా వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు పచ్చి చింతకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చిపులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చింతకాయలతో పచ్చి పులుసును తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పచ్చి పులుసును తయారు చేయడం చాలా సులభం. పచ్చి చింతకాయలతో రుచిగా పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయ పచ్చి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతకాయలు – 70 నుండి 80 గ్రాములు, ధనియాలు – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బెల్లం – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్.
చింతకాయ పచ్చి పులుసు తయారీ విధానం..
ముందుగా చింతకాయలను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు నీటిని పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ చింతకాయలను తొక్కలు, గింజలు వేరయ్యేలా చేత్తో బాగా నలపాలి. తరువాత వీటిని వడకట్టి మన రుచికి తగినట్టు మరిన్ని నీళ్లు పోసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, మిరియాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని చారులో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర, బెల్లం వేసి కలపాలి.
తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మిగిలినపదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాళింపును పచ్చి పులుసులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చి పులుసు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చి చింతకాయలు ఎక్కువగా లభించినప్పుడు వాటితో ఇలా పచ్చి పులుసును తయారు చేసి తీసుకోవచ్చు.