Instant Maggi Egg Noodles : మనలో చాలా మంది మ్యాగీ నూడుల్స్ ను ఇష్టంగా తింటారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని తింటారు. అల్పాహారంగా, స్నాక్స్ గా, లంచ్ బాక్స్ లోకి కూడా ఈ మ్యాగీ నూడుల్స్ ను తింటూ ఉంటారు. అలాగే ఈ నూడుల్స్ ను వారి వారి అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఇలా సులభంగా తయారు చేసుకోదగిన మ్యాగీ వెరైటీలలో ఎగ్ మ్యాగీ నూడుల్స్ కూడా ఒకటి. కోడిగుడ్లు వేసి చేసే మ్యాగీ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎవరైనా చాలా తేలికగా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా మ్యాగీ ఎగ్ నూడుల్స్ ను అందరికి నచ్చేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ మ్యాగీ ఎగ్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – చిన్నది ఒకటి, కోడిగుడ్లు – 2, ఉప్పు – చిటికెడు, గరం మసాలా – చిటికెడు, పసుపు – చిటికెడు, కారం – పావు టీ స్పూన్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, మ్యాగీ – 2, మ్యాగీ మసాలా ప్యాకెట్స్ – 2.
ఇన్ స్టాంట్ మ్యాగీ ఎగ్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత వీటిని కళాయిలోనే పక్కకు అని కోడిగుడ్లను వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఉడికే వరకు అలాగే ఉంచి ఆ తరువాత గంటెతో కదుపుకోవాలి. కోడిగుడ్లు ఉడికిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మ్యాగీ నూడుల్స్ వేసి కలపాలి. ఈ నూడుల్స్ ప్యాకెట్ లో వచ్చే మసాలాను వేసి కలపాలి. దీనిని నీరంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ మ్యాగీ ఎగ్ నూడుల్స్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడిగా తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.