Chettinad Chicken Fry : మనం చికెన్ తో చేసే వివిధ రకాల వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి.చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈచికెన్ ఫ్రైను ఒక్కొక్కరు ఒక్కోలా విధంగా తయారు చేస్తూ ఉంటారు. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చికెన్ ఫ్రై వెరైటీలల్లో చిట్టినాడు చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా తినడానికి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ చికెన్ ఫ్రైను సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, తేలికగా చిట్టినాడు చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్టినాడు చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – 500 గ్రా., సాంబార్ ఉల్లిపాయలు – ఒక కప్పు, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, యాలకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మిరియాలు – ఒక టీ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 6 లేదా 7, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు- ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్.
చిట్టినాడు చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మసాలా దినుసులన్నీ వేసి దోరగా వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చి వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించిన తరువాత మూత పెట్టి మంటను మధ్యస్థంగా చేసి 6 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత అంతా కలిసేలా కలుపుకుని మరలా మూత పెట్టి మరో 6 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. ఈ చికెన్ ను ముక్కలు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టినాడు చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే చికెన్ ఫ్రైతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.