మునగ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల మునగ ఆకులను తీసుకోవాలని చెబుతుంటారు. దీన్ని కొందరు కూరగా చేసుకుని తింటారు. కొందరు నీటిలో ఆ ఆకులను మరిగించి తాగుతారు. అయితే మునగ ఆకులతో సూప్ కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఇది రుచికరంగా ఉండడమే కాదు, పోషకాలను కూడా అందిస్తుంది. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మరి మునగ ఆకులతో సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
కావల్సిన పదార్థాలు
- మునగ ఆకులు – ఒకటిన్నర కప్పు
- జీలకర్ర – అర టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 1 టేబుల్ స్పూన్ (క్రష్ చేసినవి)
- ఉల్లిపాయలు – 6 చిన్నవి, సన్నగా తరగాలి
- టమాటా – 1, సన్నగా తరగాలి
- నీళ్లు – 2 కప్పులు
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – 1 టీ స్పూన్
మునగ ఆకుల సూప్‌ను తయారు చేసే విధానం
ముందుగా మునగ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఒక పాత్ర తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి. అందులో వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి వేసుకోవాలి. తరువాత కొంత సేపు వేయించి అందులో ఉల్లిపాయలు, ఉప్పు వేసుకోవాలి. తరువాత కొంత సేపు వాటిని కూడా వేయించి టమాటాలను వేయాలి.
టమాటాలు గుజ్జుగా అయ్యాక మునగ ఆకులను వేసి కొంత సేపు వేయించుకోవాలి. అనంతరం అందులో నీళ్లు పోయాలి. 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. అవసరం అనుకుంటే రుచి కోసం కొంత ఉప్పు వేసుకోవచ్చు. మిరియాల పొడి చల్లుకోవచ్చు. తరువాత 1 నిమిషం ఉంచి దించేయాలి. దీంతో మునగ ఆకుల సూప్ తయారవుతుంది.
మునగ ఆకులు ఎన్నో అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయి. వీటి వల్ల షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. జీర్ణ సమస్యలు ఉండవు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మునగ ఆకులతో సూప్ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. మునగ ఆకుల నీటిని మరిగించి నేరుగా తాగలేని వారు ఈ సూప్‌ను తయారు చేసుకుని తాగవచ్చు. దీన్ని కొంత మోతాదులో చిన్నారులకు కూడా తాగించవచ్చు.