Korrala Annam : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. కొర్రల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కొర్రలతో మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడంలో ఈ కొర్రలు మనకు ఎంతో సహాయపడతాయి.
వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే కొర్రలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు మరియు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. నాడ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో కూడా కొర్రలు మనకు సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

అదే విధంగా స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించే గుణం కూడా వీటికి ఉంది. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ కొర్రలతో దోశ, చపాతీ వంటి వాటితో పాటు అన్నం కూడా వండుకుని తినవచ్చు. కొర్రల అన్నం రుచిగా ఉంటుంది. కొర్రలతో అన్నాన్ని వండుకోవడం చాలా తేలిక. కొర్రలతో అన్నాన్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ కొర్రలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత 3 టీ గ్లాసుల నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత నానబెట్టుకున్న కొర్రలను వేసి ఉడికించాలి.
వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా దగ్గర పడే వరకు ఉడికించాలి. అవసరమైతే మరో అర గ్లాస్ నీళ్లు పోసుకుని ఉడికించాలి. కొర్రలు మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత మూత పెట్టి నీరంతా పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొర్రల అన్నం తయారవుతుంది. దీనిని వేపుల్లతో కాకుండా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కొర్రలను బాగా నానబెట్టకపోయినా మెత్తగా ఉడికించకపోయినా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కొర్రలతో అన్నాన్ని వండుకుని తినడం వల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.