Ragi Veg Soup : మనం రాగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. రాగులను పిండిగా చేసి మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రాగులతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగి పిండితో మనం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, మైదాపిండితో చేసే సూప్ కంటే రాగిపిండితో చేసే సూప్ ను తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా రాగిపిండితో సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి వెజ్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – 2 టీ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – పావు కప్పు, బీన్స్ ముక్కలు – పావు కప్పు, స్వీట్ కార్న్ – పావు కప్పు, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – పావు కప్పు, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, పంచదార – పావు టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్.

రాగి వెజ్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు, స్వీట్ కార్న్ వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి కలపాలి. తరువాత నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి కలపాలి. తరువాత వెనిగర్ వేసి కలిపి కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించిచ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తాగితేనే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాగి సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రాగిపిండితో చేసిన ఈ సూప్ ను పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.