Laddu For Hair Growth : జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సమస్య బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, రసాయనాలు కలిగిన షాంపులను ఎక్కువగా వాడడం, మారిన మన జీవన విధానం వంటి వాటిని జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. తలస్నానం చేసినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్ లో దొరికే షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండకపోగా అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే చాలా మంది రకరకాల ఇంటి చిట్కాలను వాడుతూ ఉంటారు.
సహజ సిద్దమైన పదార్థాలతో ఇంటి చిట్కాల ద్వారా మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఈ ఇంటి చిట్కాలతో పాటు జుట్టు రాలడం అనే ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడాలంటే మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలను కూడా అందించడం చాలా అవసరం. ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ తో ప్రోటీన్ లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల మన జుట్టు ఎదుగుదలకు కావల్సిన పోషకాలన్నీ సమకూరుతాయి. ఈ లడ్డూలను బయోటిన్ లడ్డూలు అని కూడా అనవచ్చు. ఈ బయోటిన్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి గానూ మనం బాదం పప్పు, జీడిపప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, ఖర్జూర పండ్లు, ఎండు కొబ్బరి ముక్కలను, బెల్లం, నువ్వులు, వాల్ నట్స్, పుచ్చ గింజల పప్పు, అవిసె గింజలను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటన్నింటిని ఒక్కొక్కటి 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. బెల్లాన్ని మాత్రం 500 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ ను ముక్కలుగా చేసుకోవాలి. ఈ పదార్థాలతో బయోటిన్ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అవిసెగింజలను, నువ్వులను విడివిగా వేయించి బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో బెల్లం, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దానిని వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని మధ్యస్థ మంటపై ఉడికిస్తూ ఉండాలి.
ఇందులో బరకగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజలు, నువ్వులతో పాటు మిగిలిన డ్రై ఫ్రూట్స్ పలుకులు కూడా వేసి కలపాలి. తరువాత దీనిని కలుపుతూ లడ్డూ చుట్టడానికి వీలుగా అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రోటీన్ లడ్డూ లేదా బయోటిన్ లడ్డూ తయారవుతుంది. దీనిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలతో పాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. ఈ విధంగా జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు ఇతర చిట్కాలను పాటిస్తూనే ఇలా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల జుట్టు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ లడ్డూలను తినడం వల్ల రుచితో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.