Healthy Food : మనలో చాలా మంది అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తినడానికి సమయం లేక ఏది పడితే అది తిని ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. దీంతో శరీరానికి తగినన్ని పోషకాలు అందక నీరసంతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. నీరసం, బలహీనతను తగ్గించే ఈ వంటకం ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎనర్జిటిక్ ఫుడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బాదం పప్పు -15, నానబెట్టిన సబ్జాగింజలు – ఒక టేబుల్ స్పూన్, ఓట్స్ – అర కప్పు, తరిగిన ఆపిల్ – 1, చిన్న ముక్కలుగా తరిగిన అరటిపండు – 1, కాచిన పాలు – 2 కప్పులు, నీళ్లు – ఒకటిన్న కప్పు, బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్స్.

ఎనర్జిటిక్ ఫుడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలు, నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత బాదంపప్పు, ఓట్స్ వేసి కలపాలి. ఓట్స్ ఉడికిన తరువాత సబ్జా గింజలు వేసి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత బెల్లం పొడి వేసి కలపాలి. తరువాత అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎనర్జిటిక్ ఫుడ్ తయారవుతుంది. దీనిని ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు దీనిలో బెల్లం వేసుకోకపోవడమే మంచిది.
అలాగే ఇందులో ఇతర పండ్ల ముక్కలను, ఇతర డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, బీపీతో బాధపడే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా ఈ ఫుడ్ ను తీసుకోవచ్చు. ఈవిధంగా నీరసం, బలహీనత, నిస్సత్తువ, రోజంతా ఉత్సాహంగా పని చేసుకోకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా ఉదయం పూట ఎనర్జిటిక్ ఫుడ్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.