Jarupindi Appalu : మనం అప్పుడప్పుడూ కొన్ని సాంప్రదాయ తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వాటిలో జారుపిండి అప్పాలు కూడా ఒకటి. జారుపిండి అప్పాలు చాలా రుచిగాఉంటాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. పండగలకు, స్పెషల్ డేస్ లో ఇలా జారుపిండి అప్పాలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే కేవలం 20 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ జారు పిండి అప్పాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జారు పిండి అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం – అర కప్పు, నీళ్లు – అర కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, యాలకులపొడి – పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
జారు పిండి అప్పాల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత నెయ్యి, వంటసోడా వేసి కలపాలి. తరువాత బెల్లం నీటిని పోసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ గంటె జారుడుగా పిండిని కలుపుకోవాలి.
తరువాత వెడల్పుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని నూనెలో గుండ్రంగా వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తరువాత గంటెతో తీసుకుని దానిని మరో గంటెతో నూనెంత పోయేలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జారుపిండి అప్పాలు తయారవుతాయి. ఈ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇవి నిల్వ కూడా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా జారుపిండి అప్పాలను తయారు చేసుకుని తినవచ్చు.