Amruthaphalam : మనం బియ్యంతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంతో చేసే తీపి వంటకాల్లో అమృతఫలం కూడా ఒకటి. ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసే వారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. పిల్లలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ తీపి వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం. తరుచూ పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో కూడా తీపి వంటకాలను తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు బలాన్ని చేకూర్చే ఈ తీపి వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమృతఫలం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు – ఒక కప్పు, నెయ్యి – 5 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, గసగసాలు – 2 టీ స్పూన్స్, బెల్లం – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు,యాలకుల పొడి – పావు టీ స్పూన్.
అమృతఫలం తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత గసగసాలు వేసి వేయించి వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న బియ్యం వేసి కలపాలి. దీనిని అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఈమిశ్రమం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి.
తరువాత 5 నిమిషాలకొకసారి ఒక్కో టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తూ కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గర పడి కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు ఉడికించిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి లేదా ట్రేలోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అమృతఫలం తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.