Lemon Punch : లెమన్ పంచ్.. నిమ్మరసంతో తయారు చేసే ఈ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా జ్యూస్ సెంటర్లల్లో, రెస్టారెంట్ లలో లభిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. తియ్యగా, కారంగా, పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ లెమన్ పంచ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు లెమన్ పంచ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే రుచిగా, చల్ల చల్లగా లెమన్ పంచ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ పంచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మకాయలు – 2, ఉప్పు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1,పంచదార – 3 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 4 లేదా 5, చల్లటి నీళ్లు – 300 ఎమ్ ఎల్.
లెమన్ పంచ్ తయారీ విధానం..
ముందుగా షేకర్ కప్పును తీసుకుని అందులో నిమ్మరసం వేసుకోవాలి. తరువాత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తరువాత నీళ్లు పోసి కప్పును షేక్ చేస్తూ ఉండాలి. దీనిని బాగా షేక్ చేసిన తరువాత గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ పంచ్ తయారవుతుంది. షేకర్ కప్పు లేని వారు బాటిల్ లో కూడా ఈ లెమన్ పంచ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే అప్పటికప్పుడు చల్ల చల్లగా లెమన్ పంచ్ ను తయారు చేసి తీసుకోవచ్చు.