5 Home Remedies For High BP : మారిన జీవన విధానం కారణంగా తలెత్తుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, వ్యాయామం చేయకపోవడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, మద్యపానం వంటి వివిధ కారణాల చేత చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక రక్తపోటు కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉంది. అధిక రక్తపోటు కారణంగా గుండె ఆరోగ్యం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. వైద్యులు దీనిని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తూ ఉంటారు. అధిక రక్తపోటు కారణంగా శరీర పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది.
అధిక రక్తపోటు సమస్య తీవ్ర అనారోగ్యానికి దారి తీయకుండా ఉండాలంటే మనం జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. మద్యపానాన్ని తీసుకోవడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. వీటితో పాటు రోజూ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోజూ పదివేల అడుగులు నడవాలి. ఇలా ప్రతిరోజూ వాకింగ్ చయడం వల్ల అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. అలాగే రోజూ నృత్యం చేయాలి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో నృత్యం మనకు ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు నృత్యం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజూ సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు.
సైక్లింగ్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు స్విమ్మింగ్ చేయాలి. ఈత కొట్టడం వల్ల అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. శరీరం కూడా ధృడంగా తయారవుతుంది. బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. వీటితో పాటుగా ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. రోజూ 1500 మిల్లీ గ్రాముల కంటే తక్కువ సోడియంను తీసుకోవాలి. బయట లభించే చిరుతిళ్లను తీసుకోవడం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలోకి వెళ్లే ఉప్పు శాతం తగ్గుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల చాలా సులభంగా మనం అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.