Street Style Chicken Noodles : మనకు సాయంత్రం సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే వాటిలో చికెన్ నూడుల్స్ కూడా ఒకటి. చికెన్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా వీటిని తింటారని చెప్పవచ్చు. అయితే బయట చేసే ఈ నూడుల్స్ ను మనం ఇంట్లో కూడా అదే రుచితో తయారు చేసుకోవచ్చు. సాసెస్ ఏమి వేయకుండా రుచిగా స్ట్రీట్ స్టైల్ లో చేసే ఈ నూడుల్స్ ను అందరూ ఎంతో ఇష్టపడతారని చెప్పవచ్చు. స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక లీటర్, నూడుల్స్ – ఒక రోల్, కోడిగుడ్లు – 2, చిన్నగా కట్ చేసిన బోన్ లెస్ చికెన్ – అరకప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన క్యారెట్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, క్యాబేజి తరుగు – పావు కప్పు, ఫ్రెంచ్ బీన్స్ – 2 టేబుల్ స్పూన్స్, హక్కా నూడుల్స్ మసాలా ప్యాకెట్ – చిన్నది ఒకటి, స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా.
స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నీళ్లు పోసి నీటిని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత కళాయిని పక్కకు తీసి అందులో నూడుల్స్ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఫోర్క్ తో నూడుల్స్ ను విడివిడిగా చేసి మూత పెట్టి మరో 3 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నూడుల్స్ ను వడకట్టి పై నుండి చల్లటి నీళ్లు పోసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్లు వేసి వేయించాలి. వీటిపై కొద్దిగా ఉప్పును చల్లుకుని వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ వేసి వేయించాలి.
చికెన్ ఎర్రగా వేగిన తరువాత కొద్దిగా నూడుల్స్ మసాలా వేసికలిపి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కూరగాయల ముక్కలన్నీ వేసి వేయించాలి.వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత వేయించిన కోడిగుడ్లు, చికెన్ వేసి కలపాలి. తరువాత నూడుల్స్, నూడుల్స్ మసాలా, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నూడుల్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.