Chicken Dum Kichdi : చికెన్ తో కూర, వేపుడుతో పాటు మనం పులావ్, బిర్యానీ వంటి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే రైస్ ఐటమ్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో పాటు చికెన్ తో మనం కిచిడీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ తో కిచిడీని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ హల్వాను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ధమ్ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ధమ్ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – పావు కప్పు, యాలకులు – 2, లవంగాలు – 5, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, గంట పాటు నానబెట్టిన పెసరపప్పు – అర కప్పు, గంట పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 6, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – పావుకిలో, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 కప్పులు.
చికెన్ ధమ్ కిచిడీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత పెసరపప్పు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని మరో 3 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి.
తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్యస్థ మంటపై 70 శాతం ఉడికే వరకు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి పైన టిష్యూ పేపర్ లను ఉంచి నీటిని చల్లుకోవాలి. తరువాత మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత టిష్యూ పేపర్స్ తీసేసి మూత పెట్టి పావు గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ధమ్ కిచిడీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కిచిడీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.