Verushenaga Pappula Pachadi : మనం పల్లీలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. పల్లీలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పల్లి పచ్చడి కూడా ఒకటి. కింద చెప్పిన విధంగా చేసే పల్లి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలు, రాగి సంగటి వంటి వాటితో ఈ పచ్చడిని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా పల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 10 లేదా కారానికి తగినన్ని, వెల్లుల్లి రెమ్మలు – 5, తరిగిన చిన్న ఉల్లిపాయలు – 2, ఎండుమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.
పల్లి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. వీటిని మాడిపోకుండా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పొట్టు తీసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పల్లీలు, కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పచ్చడి తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.