Egg Paratha : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాల్లో ఎగ్ పరాటా కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వెరైటీ రుచులు కోరుకునే వారు తరుచూ ఒకేరకం పరాటాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉడికించిన కోడిగుడ్లు – 4, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, మయోనీస్ – 2 టీ స్పూన్స్.
ఎగ్ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు స్టఫింగ్ తయారీకి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్లను తురిమి తీసుకోవాలి. తరువాత ఇందులో వేయించిన ఉల్లిపాయలను, అలాగే మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత ముందుగా కలిపిన పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి.
తరువాత దీనిపై నూనె, పొడి పిండి చల్లుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చపాతీని మడిచి మరలా చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ను ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత పరోటాలా వత్తుకోవాలి. దీనిని చతురస్రాకారంలో లేదా గుండ్రగా మనకు నచ్చిన ఆకారంలో వత్తుకోవాలి. ఇలా పరాటాను తయారు చేసుకున్న దీనిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె లేదా బటర్ వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పరాటా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.