Thotakura Vellulli Karam Vepudu : తోటకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో ఇది కూడా ఒకటి. తోటకూరలో ఎన్నో పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తోటకూరను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా తోటకూర మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తోటకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో తోటకూర వెల్లుల్లి కారం కూడా ఒకటి. వెల్లుల్లికారం వేసి చేసే ఈ తోటకూర వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ తోటకూర వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర వెల్లుల్లికారం వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించిన ధనియాలు – ఒక టీ స్పూన్, వేయించిన జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 12, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన తోటకూర – 4 కట్టలు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
తోటకూర వెల్లుల్లికారం వేపుడు తయారీ విధానం..
ముందుగా రోట్లో ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, కారం వేసి దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తోటకూర వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి తోటకూరను మగ్గించాలి. తోటకూర మగ్గిన తరువాత మూత తీసి ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిని దగ్గర పడే వరకు వేయించాలి. తోటకూర పూర్తిగా మగ్గిన తరువాత దంచుకున్న వెల్లుల్లి కారం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర వెల్లుల్లికారం వేపుడు తయారవుతుంది. వేడి వేడిగా దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.