మనలో చాలా మందికి గ్యాస్ సమస్య ఉంటుంది. ఇది సహజమే. గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే గ్యాస్ వల్ల ఒక్కోసారి ఛాతిలో నొప్పి వస్తుంది. దీంతో ఆ నొప్పిని గుండె నొప్పి అనుకుని ఆందోళన చెందుతారు. అయితే అలా అప్రమత్తంగా ఉండడం మంచిదే. కానీ గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడాలు ఉంటాయి. అవేమిటంటే..
గ్యాస్ నొప్పి వస్తే కనిపించే లక్షణాలు
* ఛాతిలో ఎడమ వైపు నొప్పిగా ఉంటుంది.
* కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
* సాధారణ లేదా పుల్లని త్రేన్పులు వస్తాయి.
* కడుపులో మంటగా ఉంటుంది. గుండెల్లో మంట వస్తుంది.
గుండె నొప్పి వస్తే కనిపించే లక్షణాలు
* గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. ఛాతి మీద ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది.
* విపరీతమైన చెమట పడుతుంది.
* ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ ఉంటాయి.
* కొందరిలో విరేచనాలు అవుతాయి.
* కొందరికి వాంతులు అవుతాయి.
* ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. పట్టేసినట్లు అనిపిస్తుంది.
* ఛాతి మధ్య భాగం నుంచి నిలువుగా గడ్డం వరకు నొప్పి ఉంటుంది.
* కొందరికి ఛాతి మొత్తం నొప్పి ఉంటుంది.
* స్పృహ తప్పి పడిపోతారు.
ఇలా గ్యాస్ నొప్పి, గుండె నొప్పి లక్షణాలను గమనించవచ్చు. అయితే కొందరికి గ్యాస్ నొప్పి లక్షణాలతోనూ గుండె నొప్పి వస్తుంది. కనుక ఏ నొప్పి అయినా సరే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకైనా మంచిది పరీక్షలు చేయించుకుంటే మంచిది. సమస్య లేకపోతే సరే. కానీ ఉంటే మాత్రం పరీక్షల్లో తెలుస్తుంది. దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.