Ranapala : అందంగా, చూడడానికి చక్కగా ఉన్నాయని మనం రకరకాల మొక్కలను ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే కొన్ని రకాల మొక్కలు మనకు ఔషధంగా కూడా ఉపయోగపడతాయి. అలాంటి మొక్కల్లో రణపాల మొక్క కూడా ఒకటి. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం పిన్నటం. ఆయుర్వేదంలో ఈ రణపాల మొక్కను ఎన్నో ఏళ్లుగా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రణపాల మొక్క ఆకులు మందంగా, వగరు మరియు పులుపు రుచిని కలిగి ఉంటాయి. రణపాల మొక్క వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రణపాల మొక్కలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.
మూత్రపిండాల్లో రాళ్లతో పాటు మూత్రసంబంధింత సమస్యలను కూడా రణపాల మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. అలాగే అంటు వ్యాధులు, గాయాలు, శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో రణపాల మొక్క మనకు ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్య పరంగానే కాదు వాస్తు పరంగా కూడా రణపాల మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రణపాల మొక్క ఆకులతో, కాండంతో చేసిన టీ ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ టీని తాగడం వల్ల తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయి. మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు రణపాల మొక్క ఆకులను శుభ్రపరిచి నేరుగా నమిలి తినవచ్చు. ఇలా తినలేని వారు పావు లీటర్ నీటిలో నాలుగు రణపాల మొక్క ఆకులను వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయట పడవచ్చు.
ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి లేపనంగా రాసుకోవడం వల్ల నడుము నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. మొలల సమస్యతో బాధపడే వారు రణపాల మొక్క ఆకుల్లో మిరియాలు కలిపి తినడం వల్ల మొలల సమస్య నుండి బయటపడవచ్చు. రణపాల మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులో పండ్లు, అల్సర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ రసాన్ని తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ మొక్క ఆకులను పరగడుపున నమిలి తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే రణపాల మొక్క ఆకుల రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల చొప్పున రెండు పూటలా తీసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. జలుబు, దగ్గు, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మొక్క ఆకులను తినడం వల్ల ఆయా సమస్యల నుండి బయటపడవచ్చు.
ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి కొవ్వు గడ్డలు, వేడి కురులపై, శరీరంలో వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆయా సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. ఈ మొక్క ఆకుల రసాన్ని రెండు లేదా మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవిపోటు తగ్గుతుంది. అలాగే 40 నుండి 50 ఎమ్ ఎల్ మోతాదులో ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకుని అందులో తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే యోని సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే రణపాల మొక్కల ఆకుల రసాన్ని కళ్ల చుట్టూ లేపనంగా రాసుకోవడం వల్ల కళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఈ మొక్క ఆకులను వేడి చేసి గాయలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఈ మొక్క ఆకులను ఎండబెట్టి టీ లాగా కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా రణపాల మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.