Ullipaya Palli Chutney : మనం అల్పహారాలను తీసుకోవడానికి రకరకాల చట్నీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. చట్నీతో తింటేనే అల్పాహారాలు చక్కగా ఉంటాయి. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన చట్నీలల్లో ఉల్లిపాయ పల్లి చట్నీ కూడా ఒకటి. దోశ, ఇడ్లీ, వడ ఇలా దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం చట్నీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారాల్లోకి రుచిగా ఉల్లిపాయ పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 8 లేదా కారానికి తగినన్ని, అల్లం – అర ఇంచు ముక్క, పొడువగా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెమ్మలు – 4, కొత్తిమీర – 2 రెమ్మలు, వేయించి పొట్టు తీసిన పల్లీలు- ఒక కప్పు, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 4.
ఉల్లిపాయ పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కొత్తిమీర వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత పల్లీలు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న చట్నీలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పల్లి చట్నీ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.