Milk Sweet : మనం పాలతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పాలతో చేసిన తీపి వంటకాలను తినడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. తరుచూ ఒకేరకంగా కాకుండా పాలతో కింద చెప్పిన విధంగా చేసే తీపి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు, పాలు విరిగినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ మిల్క్ స్వీట్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని అందరూ ఇష్టపడతారని కూడా చెప్పవచ్చు. పాలతో ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – ముప్పావు కప్పు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
మిల్క్ స్వీట్ తయారీ విధానం..
ఈ స్వీట్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం పనీర్ ను తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక గిన్నెలో పాలను తీసుకుని మరిగించాలి. తరువాత నిమ్మరసంలో మరో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలిపి పక్కకు ఉంచాలి. పాలు పొంగు వచ్చిన తరువాత మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలపాలి. పాలు విరిగిన తరువాత మరో 3 గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు నీటిని వడకట్టి పనీర్ ను తీసుకోవాలి. ఈ పనీర్ ను మరోసారి నీటిలో వేసి కడగాలి. తరువాత నీరంతా పోయేలా వడకట్టి ఒక కాటన్ వస్త్రంలో తీసుకుని మూట కట్టాలి. ఈ మూటపై బరువును ఉంచి 2 గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల పనీర్ తయారవుతుంది. ఈ పనీర్ ను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. పంచదార తీగపాకం రాగానే యాలకుల పొడి వేసి కలపాలి.
తరువాత పనీర్ ముక్కలు వేసి కలపాలి. వీటిని నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. ఇలా 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొద్దిగా పంచదార మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీసుకుని చూడాలి. ఈ మిశ్రమం తెల్లగా గట్టిగా ముద్దగా అయ్యిందంటే పాకం తయారైనట్టే. ఇలా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి పాకం పనీర్ కు పట్టేలా కలుపుతూ ఉండాలి. పాకం చల్లారి మరలా పంచదారలా పనీర్ ముక్కలకు పట్టుకున్న తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పైన డ్రైప్రూట్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిల్క్ స్వీట్ తయారవుతుంది. ఈ స్వీట్ ను మనం బయట లభించే పనీర్ తో కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ ను ఎంత తీసుకుంటే పంచదార అంతే మొత్తంలో తీసుకుని ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన స్వీట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.