Rasam Annam : సాధారణంగా మనకు రెస్టారెంట్లలో అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు లభిస్తుంటాయి. వెజ్ వంటకాల్లో రసం అన్నం కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది దీన్ని వడ్డిస్తున్నారు. రసం అన్నం వాస్తవానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే చాలు, ఇంట్లోనే ఎంతో రుచిగా రసం అన్నంను తయారు చేయవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పని కూడా లేదు. ఇక రసం అన్నంను ఎలా తయారు చేయాలో, ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రసం అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర కప్పు, కందిపప్పు – పావు కప్పు, పెసర పప్పు – 2 టీస్పూన్లు, టమాటాలు – 2, పసుపు – పావు టీస్పూన్, రసం పొడి – ఒకటిన్నర స్పూన్, నూనె – పావు కప్పు, ఆవాలు – అర టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, ఎండు మిరపకాయలు – 2, ఇంగువ – పావు టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు, చింతపండు గుజ్జు – రెండు పెద్ద టీస్పూన్లు, నీళ్లు – రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత.
రసం అన్నంను తయారు చేసే విధానం..
బియ్యం, కందిపప్పు, పెసర పప్పులను విడివిడిగా పావుగంటపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఎండు మిర్చి వేసి చిటపటమన్నాక ఇంగువ, కరివేపాకులు వేయాలి. ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు వేసి రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి. దీనికి పసుపు, రసం పొడి జత చేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, కందిపప్పు, పెసర పప్పు వేసి బాగా కలపాలి. రెండున్నర కప్పుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు, చింతపండు గుజ్జును కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉడకడం మొదలయ్యాక మంటను పెద్దగా చేసి మూత పెట్టి మూడు, నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతే.. రుచికరమైన రసం అన్నం రెడీ అవుతుంది. దీన్ని పుదీనా, కొత్తిమీర చట్నీలతో తింటే.. రుచి అదిరిపోతుంది. అందరూ దీన్ని ఇష్టంగా తింటారు.