Iron And Calcium Tablets : మన శరీరం సరిగ్గా విధులు నిర్వర్తించాలంటే మనకు ఐరన్, క్యాల్షియం రెండూ అవసరమే. ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు క్యాల్షియం కావాలి. ఇక కొందరికి తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ రెండు ట్యాబ్లెట్లను వాడాల్సిన పరిస్థితి వస్తుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు వీటిని వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ రెండు ట్యాబ్లెట్లను తీసుకుంటున్న వారు రెండింటినీ ఒకేసారి కలిపి మాత్రం వేసుకోకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రెండు ట్యాబ్లెట్లను ఒకేసారి కలిపి వేసుకోవడం వల్ల రెండింటినీ శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ముఖ్యంగా క్యాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ శోషణను 40 నుంచి 60 శాతం మేర తగ్గించేస్తాయి. అంటే మీరు రెండు ట్యాబ్లెట్లను ఒకేసారి వేసుకుంటే మీరు వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్లలో కేవలం 40 నుంచి 60 శాతం వరకు మాత్రమే మీ శరీరం శోషించుకుంటుందన్నమాట. కనుక ఈ రెండు ట్యాబ్లెట్లను వేసుకునేందుకు తప్పనిసరిగా 30 నిమిషాల గ్యాప్ అయినా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఐరన్ ట్యాబ్లెట్లను వాడే సమయంలో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోరాదు. లేదంటే ఐరన్ శోషణ తగ్గిపోతుంది. అలాగే ఐరన్ ను శరీరం ఎక్కువగా శోషించుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఆ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. లేదంటే భోజనం చేసే ముందు వేసుకోవాలి. ఈ విషయాలను మీ వైద్యుడిని అడిగి తెలుసుకోవచ్చు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్టు పూజా మఖిజా చెబుతున్న ప్రకారం, ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు మనకు ఎంతో మేలు చేస్తాయి, రెండింటినీ శరీరంలోని ఒకే కణాలు శోషించుకుంటాయి. కనుక రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఏదో ఒకటే ఎక్కువగా శోషించుకోబడుతుంది, రెండోది అంతగా శోషించుకోబడదు, కనుక రెండింటినీ శరీరం శోషించుకోవాలంటే రెండు ట్యాబ్లెట్లను వేసుకుంటానికి మధ్య కనీస వ్యవధి 30 నిమిషాలు అయినా ఉండాలి, అని చెప్పారు.
ఇక ఐరన్ ట్యాబ్లెట్లను వేసుకుంటే పాలు, చీజ్, పెరుగు, పాలకూర, టీ, కాఫీ, తృణ ధాన్యాలను తీసుకోకూడదు. తీసుకోవాల్సి వస్తే కనీసం వ్యవధి 2 గంటలు అయినా ఉండాలి. లేదంటే మీరు వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్లలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. అంతా వృథా అయిపోతుంది. కనుక ఈ ట్యాబ్లెట్లను వాడేవారు పైన తెలిపిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.