Depression : డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. దీర్ఘకాలికంగా ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే వారు ఎప్పుడో ఒకసారి డిప్రెషన్ బారిన పడతారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు కాసేపు విచారంగా ఉండి మళ్లీ మూడ్ మార్చుకుని హ్యాపీగా ఉంటారు. అయితే ఇది డిప్రెషన్ కాదు. డిప్రెషన్ ఉన్నవారిలో ప్రత్యేకంగా పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
డిప్రెషన్ లక్షణాలు ఇవే..
ఏ కారణం లేకుండా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా విచారంగా ఉండడం, ఆహారం తినడంపై అసలు ఆసక్తి లేకపోవడం లేదా మరీ అతిగా తినడం, శరీరంలో శక్తి లేనట్లు ఎల్లప్పుడూ ప్రవర్తించడం, నీరసంగా ఉందని చెప్పడం, ఒకప్పుడు బాగా ఎంజాయ్ చేసిన వాటిని కూడా వదిలేయడం, లేదా వాటి పట్ల ఆసక్తిని చూపించకపోవడం, ఎల్లప్పుడూ ఆకలి లేదని చెబుతుండడం, నిద్ర సరిగ్గా పోకపోవడం లేదా మరీ ఎక్కువగా నిద్రించడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీవ్రమైన నొప్పులు ఉన్నాయని తరచూ చెబుతుండడం, జీవితంపై విరక్తి కలుగుతుందని, తనకు ఇక ఎలాంటి ఆశలు లేవని చెబుతుండడం, ఊరికే విసుగు రావడం, కోపం తెచ్చుకోవడం, మరణం గురించి లేదా ఆత్మహత్య గురించి ఎక్కువగా మాట్లాడడం, జీర్ణ సమస్యలు ఉన్నాయని చెప్పడం.. ఇవన్నీ డిప్రెషన్ ఉందని చెప్పేందుకు సంకేతాలుగా భావించవచ్చు.
ఈ లక్షణాలు గనక ఎవరిలో అయినా ఉంటే వారు డిప్రెషన్ బారిన పడ్డారని అర్థం. డిప్రెషన్ ఉన్నవారిని ఈ లక్షణాలను బట్టి సులభంగా గుర్తించవచ్చు. అలాగే వారు నలుగురిలోనూ కలవలేకపోతుంటారు. బయటి ప్రపంచంలోకి వచ్చేందుకు నిరాకరిస్తారు. చీకట్లో ఉండేందుకే ప్రాధాన్యతను ఇస్తారు. ఇవి కూడా డిప్రెషన్ లక్షణాలే అని చెప్పవచ్చు. అయితే ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వాళ్లకు మీరు సహాయం చేయండి. అందుకు గాను కింద తెలిపిన 6 సూచనలను పాటించండి.
సావధానంగా వినండి..
డిప్రెషన్ ఉన్నవారు తమ మనసులో ఉన్న భావాలను ఎవరికీ చెప్పలేకపోతుంటారు. ఎవరికైనా చెబితే నవ్వుతారని లేదా తమ ఫెయిల్యూర్ పట్ల ఎగతాళి చేస్తారని, తమను అవమానిస్తారని భయపడుతుంటారు. కనుక తాము ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాము.. అనే విషయాన్ని సాధారణంగా వారు ఇతరులకు చెప్పరు. కానీ మీరు గనక వారితో చక్కగా మాట్లాడి వారు చెప్పే అన్ని విషయాలను ప్రశ్నించకుండా వింటే అప్పుడు వారిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వారు చెప్పే విషయాలకు ఎదురు మాట్లాడకూడదు. అలా ఎందుకు చేశావు అనకూడదు. వారు చెప్పే విషయాలను సావధానంగా వినాలి. తరువాత అంతా అదే సర్దుకుంటుందని ధైర్యం చెప్పాలి. అంతే కానీ తప్పు చేశాని అనకూడదు. ఇక ఇలా వారు చెప్పే విషయాలను విని వారికి సర్ది చెప్పడం వల్ల వారి మానసిక ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుంది. దీంతో వారు డిప్రెషన్ నుంచి బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒత్తిడిని తగ్గించండి..
డిప్రెషన్ బారిన పడిన వారు ఒత్తిడిని ఏమైనా ఎదుర్కొంటున్నారో లేదో పరిశీలించండి. ఎందుకంటే చాలా మంది ఒత్తిడి కారణంగానే డిప్రెషన్ బారిన పడతారు. ఒత్తిడి ఎందుకు వస్తుందో అడిగి తెలుసుకోండి. దాన్ని పోగొట్టేందుకు వారికి సహాయం చేయండి. దీంతో ఒత్తిడి పోయి ఆటోమేటిగ్గా వారు డిప్రెషన్ నుంచి కూడా బయట పడతారు. అలాగే డిప్రెషన్ బారిన పడిన వారికి మీకు తోచిన సహాయం చేయండి. రోజూ వారిని కలవండి. పాజిటివ్ మాటలు మాట్లాడండి. దీంతో వారిలో డిప్రెషన్ తగ్గుతుంది.
ఇక డిప్రెషన్ బారిన పడిన వారితో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. అవసరం అయితే కాల్ చేయాలి. లేదా మెసేజ్ పెట్టాలి. వారిని బయటకు తీసుకెళ్లాలి. సినిమాకో లేదా పార్కుకో, ఆలయానికో తీసుకెళ్లాలి. దీంతో వారిలో మానసికంగా చాలా మార్పు వస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడతారు. అలాగే డిప్రెషన్ తో బాధపడుతున్న వారి మీద ఎప్పుడూ కోపం, విసుగు ప్రదర్శించకండి. ఎందుకంటే డిప్రెషన్ అనేది అంత ఈజీగా తగ్గదు. అందుకు కొన్ని వారాలు లేదా నెలలు పడుతుంది. కనుక అప్పటి వరకు ఓపిగ్గా ఉండండి. వారు చెప్పేది సావధానంగా వినండి.
థెరపీ చేయించండి..
అలాగే డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు సహజంగానే డాక్టర్‌ను కలిసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ వారిని ఎంకరేజ్ చేసి డాక్టర్‌ను కలిసేలా చేయండి. దీంతో వారు సైకలాజికల్ థెరపీ చేస్తారు. అలాగే మందులను రాస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడేలా చూడండి. దీంతో డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. ఇలా మీకు తెలిసిన వారు ఎవరైనా డిప్రెషన్ తో బాధపడుతుంటే వారికి సహాయం చేయండి. వారికి ఎంతో మంచి చేసిన వారు అవుతారు.