Foods To Take On Empty Stomach : రాత్రి భోజనం చేసిన తరువాత మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు చాలా గ్యాప్ వస్తుంది. సుమారుగా 10 నుంచి 14 గంటల విరామం ఉంటుంది. దీంతో ఉదయం నిద్ర లేవగానే మన శరీరం శక్తిని కోరుకుంటుంది. కనుక ఉదయం శక్తినిచ్చే ఆహారాలను ఎక్కువగా తినాలి. అలాగే ఉదయం మనం తినే ఆహారంలో పోషకాలు ఉండేలా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం మనం తినే ఆహారం నుంచే చాలా వరకు పోషకాలను శరీరం శోషించుకుంటుందని కూడా వైద్యులు చెబుతున్నారు. కనుక మనం ఉదయం తినే ఆహారంపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను ఉదయం తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఇక ఆ ఆహారాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి..
ఉదయం మీరు పరగడుపునే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచిది. దీంతో శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. ఉదయం తినాల్సిన ఆహారాల్లో బాదం పప్పు కూడా ఒకటి. రాత్రి పూట వీటిని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తినాలి. రోజూ గుప్పెడె బాదం పప్పును ఇలా నీటిలో నానబెట్టి తినడం వల్ల మన శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. దీంతోపాటు ఫైబర్ కూడా అందుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్దకం తగ్గుతుంది. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
ఓట్స్..
ఉదయం తినాల్సిన ఆహారాల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్‌ను ఓట్ మీల్ రూపంలో తినవచ్చు. లేదా ఉప్మాలా చేసి కూడా తినవచ్చు. పాలలో కలిపి తినవచ్చు. పండ్ల ముక్కలతోనూ తీసుకోవచ్చు. ఓట్స్‌ను తినడం వల్ల సంక్లిష్టమైన పిండి పదార్థాలు లభిస్తాయి. ఇవి మనకు రోజంతటికీ కావల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. చురుగ్గా పనిచేయవచ్చు. బద్దకం రాకుండా ఉంటుంది. అలాగే రోజంతా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
పెరుగు..
ఉదయం మీరు తినాల్సిన పదార్థాల్లో పెరుగును కూడా చేర్చుకోవాలి. పెరుగులో మన శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాలకు శక్తిని ఇస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటు రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. కనుక ఉదయం పెరుగును తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు వంటి బెర్రీలను ఉదయం తినాలి. వీటిల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి మనకు పోషణతోపాటు శక్తిని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి వీటిని ఉదయం తింటేనే మంచిది.
చియా విత్తనాలు..
ఉదయం మనం చియా విత్తనాలను కూడా తినవచ్చు. వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఈ విత్తనాలను నీటిలో నానబెట్టి తినాలి. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా తగ్గుతాయి.
బొప్పాయి, పాలకూర..
బొప్పాయి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తుంది. అందువల్ల బొప్పాయి పండును ఉదయం పరగడుపునే తింటే జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఉదయం పాలకూర జ్యూస్‌ను తాగినా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. దీంట్లో ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి లభిస్తాయి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఉదయం పరగడుపున కలబంద రసం కూడా తాగవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్సర్లు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఈ ఆహారాలను పరగడుపునే తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.