Eggs : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది తినే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటని చెప్పవచ్చు. కోడిగుడ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. కోడిగుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, రైబోఫ్లేవిన్, ఫోలేట్, ఫాస్ఫరస్, కోలిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక మీడియం సైజు కోడిగుడ్డు ద్వారా మనకు సుమారుగా 70 క్యాలరీలు లభిస్తాయి. అందులో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంతోపాటు అనేక పోషకాలు కూడా గుడ్లలో ఉంటాయి. అయితే రోజుకు 2 కోడిగుడ్లను తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్ల ద్వారా మనకు ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పనితీరుకు, నిర్మాణానికి ఉపయోగపడతాయి. శరీరంలోని కణజాల నిర్మాణానికి, మరమ్మత్తులకు పనిచేస్తాయి. అందువల్ల కోడిగుడ్లను రోజూ తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కోడిగుడ్లను తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అపోహేనని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కోడిగుడ్లను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అందువల్ల కోడిగుడ్లను తప్పకుండా తినాలి.
కంటి చూపు మెరుగు పడుతుంది..
అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ చెబుతున్న ప్రకారం కోడిగుడ్లను తింటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుందట. అలాగే కోడిగుడ్లలో ఉండే లుటీన్, జియాజాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. కంటి రెటీనాను రక్షిస్తాయి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
కోడిగుడ్లలో కోలిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్నారుల్లో అయితే తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. కనుక వారికి కనీసం రోజుకు ఒక గుడ్డును అయినా తినిపించాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కోడిగుడ్లను తినడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చని వెల్లడైంది.
ఎముకలు దృఢంగా మారుతాయి..
కోడిగుడ్లలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక కోడిగుడ్లను తరచూ తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. రోజూ తినడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుంది. అయితే కొందరికి అలర్జీలు ఉంటాయి. అలాంటి వారు గుడ్లను రోజూ తినకపోవడమే మంచిది. ఇక అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, షుగర్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కోడిగుడ్లను తినాల్సి ఉంటుంది. అయితే కోడిగుడ్లను చాలా మంది ఆమ్లెట్ లేదా వేపుడు రూపంలో తింటారు. కానీ అలా కాకుండా ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఫలితం ఉంటుందని, అలా తినడమే ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. కనుక రోజూ కనీసం ఒక ఉడకబెట్టిన గుడ్డును అయినా సరే తినండి. ఆరోగ్యంగా ఉండండి.