Patika Bellam : పటిక బెల్లం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది బెల్లం రంగులో ఉండదు. చక్కెరలా తెలుపు రంగులో ఉంటుంది. చక్కెర లాంటి రుచిని కలిగి ఉంటుంది. కానీ చక్కెర మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అయితే పటిక బెల్లం మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదంలోనూ పలు ఔషధాల తయారీలో, పలు రోగాలను నయం చేసేందుకు పటిక బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే పటిక బెల్లాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి, దీని వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థకు..
పటిక బెల్లం మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా అజీర్తి, కడుపులో మంట సమస్యలు ఉన్నవారు కాస్త పటిక బెల్లాన్ని తింటే త్వరగా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పటిక బెల్లాన్ని రోజూ కాస్త తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతోపాటు రక్తం కూడా శుద్ధి అవుతుంది. పటిక బెల్లాన్ని తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. సీజనల్ వ్యాధుల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది.
తక్షణ శక్తికి..
పటిక బెల్లం సహజసిద్ధమైన చక్కెర. అందువల్ల దీన్ని తింటే మనకు తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం, అలసట తగ్గుతాయి. మళ్లీ పనిచేసేందుకు కావల్సిన శక్తి వెంటనే లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. పటిక బెల్లాన్ని తినడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. పటిక బెల్లంలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి రక్షిస్తాయి. పటిక బెల్లాన్ని కాస్త తింటే చాలు, ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
గొంతు సమస్యలకు..
పటిక బెల్లంలో క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి మన శరీరానికి అవసరం అయిన మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. గొంతులో నొప్పి, గొంతులో మంట, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు పటిక బెల్లం తింటుంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పటిక బెల్లంలో శరీరంలో వేడిని పెంచే లక్షణం ఉంటుంది. కనుక చల్లగా వాతావరణం ఉన్నప్పుడు దీన్ని తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.
మోతాదులోనే తినాలి..
అయితే పటిక బెల్లం ఆరోగ్యకరం అయినప్పటికీ దీన్ని మోతాదుకు మించి తీసుకోరాదు. రోజుకు 1 టీస్పూన్ వరకు దీన్ని తీసుకోవచ్చు. అంతకు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పటిక బెల్లాన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. దీంతో డయాబెటిస్ కూడా రావచ్చు. అలాగే శరీరంలో వేడి పెరిగిపోయి విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక దీన్ని మోతాదులోనే తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.