కొంత మంది ప్రయాణం చేయాలంటే వణికిపోతుంటారు. బస్సు, కారు, విమానం, పడవల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి వికారంగా ఉండడం, వాంతులు కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్నే.. మోషన్ సిక్‌నెస్ అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. మోషన్ సిక్‌నెస్ 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారిలో ఈ సమస్య తక్కువగానే ఉంటుంది. ప్రయాణ సమయంలో చెవి లోపల అంతర్గత అవయవాలకు ఆటంకం ఏర్పడటం దీనికి కారణం. ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు కావడం వలన జర్నీ అంతా డిస్ట్రబ్ అవుతుంది.
అయితే వాంతులు కావడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం, అలసట, నిర్జలీకరణం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి వాంతులు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాల వలన ఈ సమస్యని దూరం చేయవచ్చు. అయితే ప్రయాణిస్తున్నప్పుడు కారు విండోను తెరవండి. స్వచ్ఛమైన గాలిని పొందడం వల్ల వాంతులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. డ్రైవర్ పక్కన సీటులో కూర్చోవడం వల్ల మోషన్ సిక్ నెస్ సమస్య తగ్గుతుంది. వాంతులు నివారించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు అల్లం టీ తాగవచ్చు లేదా అల్లంని చప్పరించవచ్చు. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, ఇది డైజెస్టివ్ ఎయిడ్‌గా పనిచేస్తుంది. అల్లం కీమోథెరపీ, మోషన్ సిక్‌నెస్, ప్రెగ్నెన్సీ వల్ల కలిగే వికారం, వాంతులను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి.
మీరు పుదీనా ఆకులను కూడా నమలవచ్చు. పుదీనా వాంతులు నివారించడంలో కూడా సహాయపడుతుంది. ప్రయాణానికి ముందు తేలికపాటి ఆహారాన్ని తినండి మరియు ప్రయాణంలో ఎక్కువగా తినకండి. ప్రయాణంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం వాటర్ తాగుతూ ఉండండి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా వాంతులు అవుతాయి, కాబట్టి ప్రయాణంలో నీరు త్రాగుతూ ఉండండి. మీకు తరచుగా మోషన్ సిక్‌నెస్ సమస్య ఉంటే, మీరు ప్రయాణానికి ముందు డాక్టర్ నుండి మోషన్ సిక్‌నెస్ మెడిసిన్ తీసుకోవచ్చు. స్ట్రెస్ ఎక్కువైనా.. మోషన్ సిక్‌నెస్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మీరు ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయాణ సమయంలో ధ్యానం చేయండి. ముక్కు ద్వారా లోతుగా లోతుగా శ్వాస తీసుకుని నోటి ద్వారా వదలండి, మ్యూజిక్ వినడం వంటివి చేయండి.