Tirumala Hills : ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుమల. తిరుమల గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము ఈ తిరుమల. తిరుమలలో ప్రతి శిలా చింతామణి. ప్రతి చెట్టు, ప్రతి తీగ మహర్షులు అంటారు.
అలానే, ప్రతి తీర్థం దేవగంగ స్వరూపాలని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. స్వామివారి ప్రధానాలయానికి దగ్గర ఉండే స్వామి పుష్కరిణి చాలా పవిత్రమైనది. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ పుష్కరిణిలో స్నానం చేశారని చెప్పబడింది. స్వామివారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్లడం ఆచారం. ఈ తీర్థం దగ్గర గోదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ ప్రధాన ఆలయం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగ తీర్థం ఉంది.
ఇది శ్రీవారి పాద పద్మముల నుండి ఉద్భవించింది. ఆకాశగంగలో స్నానం చేస్తే, 100 పుణ్య కార్యాలు చేసినంత ఫలితం దక్కుతుంది, ఆలయానికి మూడు మైళ్ళ దూరంలో పాప వినాశనము ఉంది. ఇక్కడ స్నానం చేస్తే, సకల పాపాలు పోతాయి. పాప వినాశానికి వెళ్లే దారిలో జాబాలీ తీర్థం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది.
జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేస్తే, ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారని చెప్తారు. ఆలయానికి 16 కిలోమీటర్ల దూరంలో, తుంగర తీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి. పాండవ తీర్థం కూడా ఇక్కడ ఉంది. అనుకున్న పనులు ఇక్కడ స్నానం చేస్తే పూర్తవుతాయట. కుమారధార తీర్థం, చక్రతీర్థం, నాగ తీర్థం, శేష తీర్థం కూడా ఉన్నాయి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు, వీటిని మర్చిపోకుండా సందర్శించి, ఇక్కడ చెప్పినట్టు ఆచరించి, కష్టాల నుండి బయటకి వచ్చేయండి.