Gundamma Katha : ఆనాటి అగ్రనటులు, తెలుగు చిత్రసీమలో రెండు కళ్ళుగా విరాజిల్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతోపాటు ఎస్వీ రంగారావు, సూర్యకాంతం వంటి దిగ్గజ నటులు, సావిత్రి, జమున హీరోయిన్స్ గా నటించిన గుండమ్మ కథ మూవీ అంటే ఇప్పటికీ క్రేజే. టీవీలో ఈ సినిమా వస్తుంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మాటలు డివి నరసరాజు రాసారు.
అసలు దీన్ని రీమేక్ చేయాలన్న తలంపు కూడా వచ్చినా కాంబినేషన్ కుదరక కార్యరూపం దాల్చలేదు. బాలకృష్ణ, నాగార్జున, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ఇలా పలు కాంబినేషన్స్ లో గుండమ్మ కథ తీయాలని చూసినా సూర్యకాంతం పాత్రకు ఎవరూ దొరక్క ఊరుకున్నట్లు టాక్ నడిచింది. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, అక్కినేని నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ నిక్కరు వేసుకుని నటించి మెప్పించారు.
తీరా సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ ని నిక్కరులో చూస్తే జనం తిరగబడతారేమోనని విజయా సంస్థ నిర్వాహకులు భయపడ్డారట. దాంతో 10 రోజుల ముందు ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి హాజరైన బంధువులకు చూపిస్తే బాగుందని చెప్పడంతో రిలీజ్ చేశారట. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. రచయితల సంఘానికి భీష్మాచార్యుడైన నరసరాజు సినిమాలు చాలా చూశానని, అందులో గుండమ్మ కథ ఒకటని చెప్పారు.