నిత్యం మనం తినే, తాగే అనేక ఆహార పదార్థాలు కల్తీవే ఉంటున్నాయి. ఈ క్రమంలో కల్తీ ఆహారాలను తినడం, పానీయాలను తాగడం వల్ల మనం అనేక అనారోగ్యాలకు గురి కావల్సి వస్తోంది. ఇక తాజాగా తెలిసిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. మనం నిత్యం కూరల్లో వేసుకునే ఉప్పులో కూడా కల్తీ జరుగుతోందట. ఆ ఉప్పులో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయట. ఈ విషయాన్ని ఐఐటీ బాంబే పరిశోధకులు చెబుతున్నారు.
ఐఐటీ బాంబే పరిశోధకులు అమృతాన్షు శ్రీవాస్తవ్, చందన్ కృష్ణ లు కంటామినేషన్ ఆఫ్ ఇండియన్ సీ సాల్ట్స్ విత్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ ఏ పొటెన్షియల్ ప్రివెన్షన్ స్ట్రాటజీ పేరిట ఇటీవలే ఓ అధ్యయనం చేశారు. అందులో తెలిసిందేమిటంటే.. మన దేశంలో పేరు మోసిన సాల్ట్ బ్రాండ్లకు చెందిన ఉప్పులు అన్నింటిలోనూ మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో 63 శాతం మైక్రోప్లాస్టిక్ రేణువులు కాగా 37 శాతం ప్లాస్టిక్ ఫైబర్లని నిర్దారించారు.
ఉప్పులో మైక్రోప్లాస్టిక్ రేణువులు వస్తుండడానికి కారణం.. నిత్యం సముద్రాల్లోకి భారీగా చేరుతున్న ప్లాస్టిక్ కాలుష్యమేనని అంటున్నారు. అందువల్లే ఉప్పులో ప్లాస్టిక్ రేణువులు వస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఐఐటీ బాంబే పరిశోధకులు మన దేశంలోని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉప్పు ప్యాకెట్లను సేకరించి వాటిని కూలంకషంగా పరిశీలించాకే ఈ వివరాలను వెల్లడించారు.
ఇలా ఉప్పులో ఉండే మైక్రోప్లాస్టిక్ రేణువులు, మైక్రో ఫైబర్స్ నిత్యం మన కడుపులోకి ఉప్పు ద్వారా చేరుతున్నాయని, దీంతో రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకునేవారి కడుపులోకి ఏడాదికి 117 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్ రేణువులు వెళ్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్లాస్టిక్ రేణువుల వల్ల మనకు కలిగే దుష్ఫలితాలపై ఇంకా అధ్యయనం చేయవలసి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. నేటి తరుణంలో మాత్రం మనం తినే, తాగే ఆహారాలను వేటిని నమ్మలేకుండా ఉన్నాం. ఇక ఈ ప్లాస్టిక్ ఉప్పు ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి ఈ ఉప్పు ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, సైంటిస్టులు చెప్పేదాకా వేచి చూడక తప్పదు..!