బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మనకు లోన్లు లేదా క్రెడిట్ కార్డులను ఇచ్చేటప్పుడు పలు అంశాలను పరిగిణనలోకి తీసుకుని మనకు రుణాలను మంజూరు చేస్తుంటాయి కదా. అయితే ఆ రుణాలను లేదా క్రెడిట్ కార్డు బిల్లలను సకాలంలో చెల్లిస్తుంటే మన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. లేదా సరిగ్గా చెల్లింపులు జరపని పక్షంలో క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. పైగా అందులో డిఫాల్టర్ అనే ముద్ర వేస్తారు. అందుకని మనం ఎప్పుడూ క్రెడిట్ స్కోరుపై ఓ కన్నేసి ఉంచాలి. క్రెడిట్ స్కోరు తగ్గకుండా చూసుకోవాలి. అందుకని దాన్ని నెల నెలా పరిశీలించాలి. మరి క్రెడిట్ స్కోరును చూడాలంటే సిబిల్ వెబ్‌సైట్‌లో అయితే ఏడాదికి ఒక్కసారే ఉచితంగా ఉంటుంది. నెల నెలా అంటే డబ్బులు కట్టాలి కదా.. ఎలా..? అంటే.. అందుకు పరిష్కారం ఉంది. పలు ఇతర వెబ్‌సైట్లలో నెల నెలా మనం మన క్రెడిట్ స్కోరును ఉచితంగానే చూడవచ్చు. మరి అది ఎలా తెలుసుకోవాలంటే..
మన దేశంలో ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్, ఎక్స్‌పీరియన్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్, క్రిఫ్ హై మార్క్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ అనే నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి బ్యూరో నుంచి మనం ఏడాదికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా నెల నెలా ఉచితంగా స్కోరు తెలుసుకోవాలంటే అందుకు వేరే వెబ్‌సైట్ లు ఉన్నాయి.
పైసా బజార్ (https://www.paisabazaar.com/), బ్యాంక్ బజార్ (https://www.bankbazaar.com/), క్రెడిట్ మంత్రి (https://www.creditmantri.com/) అనే ఈ సైట్లలో మీ వివరాలను నమోదు చేసి ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్‌ను కన్ఫాం చేస్తే చాలు.. నెల నెలా ఆ సైట్ల నుంచే మీకు మీ ఉచిత క్రెడిట్ స్కోరు రిపోర్టు మెయిల్‌కు వస్తుంది. లేదా ఆయా వెబ్‌సైట్‌లలోకి లాగిన్ అయి కూడా మీ క్రెడిట్ స్కోరును ఉచితంగా పరిశీలించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా లోన్ లేదా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే ముందుగా క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఈ స్కోరు 750 పైన ఉంటే.. మీరు అన్ని చెల్లింపులు సకాలంలో చేస్తున్నట్లు లెక్క. అంతకు మించి స్కోరు ఉంటే మీరు నిరభ్యంతరంగా లోన్లు, క్రెడిట్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. స్కోరు అంతకు తగ్గితే వాటికి అప్లై చేయకపోవడమే మంచిది. దీంతో స్కోరు ఇంకా తగ్గకుండా ఉంటుంది. అలా మీ క్రెడిట్ స్కోరును ఎప్పటికప్పుడు సరిగ్గా ఉంచుకోవచ్చు.