Orange Farming : మనస్సు ఉండాలే గానీ మార్గముంటుంది. బాగా చదువుకున్న వారు తమ చదువుకు తగిన ఉద్యోగం చేసే డబ్బులు సంపాదించాలని ఏమీ లేదు. సరిగ్గా చేయాలే కానీ.. వ్యవసాయం చేస్తూ కూడా లాభాలను పొందవచ్చు. రూ.కోట్లను గడించవచ్చు. సరిగ్గా ఆ సోదరులు కూడా అదే చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వారు 9 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన నారింజ తోట ఇప్పుడు సిరులు కురిపిస్తోంది. దాంతో వారు ఏటా రూ.కోట్లలో సంపాదిస్తున్నారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఉమేకర్ సోదరులు అంటే చాలా ఫేమస్. వారి నారింజలకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. గోపాల్ ఉమేకర్, స్వప్నిల్ ఉమేకర్ అనే ఇద్దరు సోదరులు అమరావతి జిల్లాలోని టెంబుర్‌ఖెడా అనే గ్రామంలో 9 ఏళ్ల కిందట 50 ఎకరాల స్థలాన్ని కొన్నారు. అందులో వారు అప్పట్లో 6,000 నారింజ మొక్కలను నాటారు. ఇప్పుడవి చేతికొచ్చాయి. అధిక దిగుబడిని ఇస్తున్నాయి.
అలా ఉమేకర్ సోదరులు ఆ నారింజ తోటతో పెద్ద ఎత్తున నారింజలను పండిస్తూ ఏడాదికి రూ.1.50 కోట్ల లాభాలను గడిస్తున్నారు. వారు ఎంతో చదువుకున్నప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో నారింజ తోటను ఏర్పాటు చేసి దాంతో కోట్లు సంపాదిస్తున్నారు. వీరి నారింజలు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలకు సరఫరా అవుతుంటాయి.
మొదట్లో వారు నారింజ మొక్కలకు నీళ్లు పెట్టేందుకు చాలా కష్టపడ్డారు. సుమారుగా 7 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను తెచ్చి మొక్కలకు పోసి బతికించారు. తరువాత స్మార్ట్ ఫార్మింగ్ చేయడం మొదలు పెట్టారు. అనంతరం వారు వెనుదిరిగి చూడలేదు. అధిక దిగుబడిని సాధిస్తూ లాభాల బాట పట్టారు.
సరైన ప్రణాళిక, అవగాహనతో జాగ్రత్తగా వ్యవసాయం చేస్తే ఇలా అధిక దిగుబడిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ఉమేకర్ సోదరులు చెబుతున్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి లేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఉమేకర్ సోదరులు చేస్తున్న పని అలాంటి వారికి ప్రేరణను అందిస్తోంది.