Jonna Rotte : ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది ప్రస్తుతం తమ ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రోజూ రాత్రి పూట తినే ఆహారంలో చాలా మంది అన్నానికి బదులుగా ఇతర ఆహారాలను తింటున్నారు. దీంతో బరువు తగ్గడమే కాదు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే మన పూర్వీకులు ఒకప్పుడు ఎక్కువగా తిన్న ఆహారాల్లో జొన్నలు కూడా ఒకటి. అప్పట్లో బియ్యం అందరి వద్ద ఉండేవి కావు. కానీ జొన్నలు దాదాపు అందరి ఇళ్లలోనూ ఉండేవి. దీంతో వారు జొన్నలను దంచి నిల్వ చేసి పెట్టుకునేవారు. దాంతో రకరకాల వంటలు చేసుకుని తినేవారు.
జొన్నలతో చాలా మంది అప్పట్లో గటక, సంగటి, రొట్టెలు చేసుకునేవారు. కానీ గటక, సంగటి చేయడం కష్టంతో కూడుకున్న పని. అందుకని ఇప్పుడు చాలా మంది జొన్న రొట్టెలను చేసి తింటున్నారు. అయితే వాస్తవానికి జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇవి మనకు ఎంతో బలాన్నిస్తాయి. అందుకనే మన పూర్వీకులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. వారికి ఎలాంటి రోగాలు కూడా వచ్చేవి కావు. ఇక రోజూ రాత్రి జొన్న రొట్టెలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది. ఫైబర్ వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. జొన్నల్లో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల విరిగిన ఎముకలు ఉన్నవారు జొన్న రొట్టెలను తింటే త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు త్వరగా బలంగా మారుతాయి.
జొన్నల్లో ఉండే ఫైబర్ చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారికి జొన్నలు వరమనే చెప్పవచ్చు. జొన్న రొట్టెలను రోజూ తినడం వల్ల షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల హైబీపీ సైతం తగ్గుతుంది. ఇలా జొన్న రొట్టెలను రోజూ తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి కనుక రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలాంటి రోగాలు రావు.