Pappu Chekodilu : మనకు స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో పప్పు చెకోడీలు కూడా ఒకటి. పప్పు చెకోడీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. ఈ పప్పు చెకోడీలను బయట కొనే పని లేకుండా వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఇంట్లోనే సులభంగా, క్రిస్పీగా పప్పు చెకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పు చెకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – అర కప్పు, బియ్యంపిండి – ఒక కప్పు, మైదాపిండి – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పప్పు చెకోడీల తయారీ విధానం..
ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి పప్పును తడి పోయేలా ఆరబెట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో బియ్యంపిండి, మైదాపిండి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నీళ్లు, ఉప్పు, పసుపు, కారం వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పిండి కొద్దిగా చల్లారిన తరువాత చేత్తో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ముందుగా గుండ్రగా పొడవుగా రోల్ లాగా చుట్టుకోవాలి. ఈ రోల్ మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చుట్టుకోవాలి.
తరువాత ఈ రోల్ కు ముందుగా సిద్దం చేసుకున్న శనగపప్పును అద్దాలి. పప్పు ఊడిపోకుండా కొద్దిగా గట్టిగా వత్తుకుని చెకోడీ ఆకారంలో గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెకోడీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై మంచి రంగు వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పప్పు చెకోడీలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 నుండి 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.