మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా అవి అంత కఠినంగా ఉండడం లేదని అందరికీ తెలిసిందే. సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలైతే నిందితులను కఠినంగా శిక్షించాలని ఎప్పటికప్పుడు చెబుతున్నా చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని కొందరు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకుంటున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కఠినమైన చట్టాలను రూపొందించడంలో మన ప్రభుత్వాలు, నాయకులు వెనుకంజ వేస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం అత్యాచార నిందితులను అత్యంత కఠినంగా శిక్షిస్తారు. అలాంటి వారికి ఆయా దేశాల్లో విధించే కఠిన శిక్షలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలను లైంగికంగా వేధించినా, వారిపై అత్యాచారానికి పాల్పడినా చైనా ప్రభుత్వం కఠిన శిక్ష వేస్తుంది. అలాంటి నేరాలకు పాల్పడిన ఎవరికైనా అక్కడి చట్టం ప్రకారం మరణ శిక్షే విధిస్తారు. అత్యాచారం చేసిన నిందితులకు ఇరాన్ కూడా కఠిన శిక్షలే వేస్తుంది. నిందితులన్ని ఉరి తీయడమో, కాల్చి చంపడమో చేస్తారు. మహిళలను వేధింపులకు గురి చేయాలన్నా, వారిపై అత్యాచారం చేయాలన్నా ఆఫ్ఘనిస్తాన్‌లో పురుషులు భయపడాల్సిందే. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. లేదంటే అక్కడి చట్టం ప్రకారం అలాంటి నిందితులకు ఉరిశిక్ష వేస్తారు. లేదంటే తలకు తుపాకి గురి పెట్టి కాల్చి చంపుతారు. అయితే నిందితుడికి వేసే మరణశిక్షను మాత్రం సంఘటన జరిగిన 4 రోజుల్లోనే వేయడం విశేషం. ఫ్రాన్స్‌లో రేప్ నిందితులకు 15 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష వేస్తారు. ఒక్కో సందర్భంలో బాధితురాలికి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా ఎక్కువ సంవత్సరాలే నిందితులకు జైలు శిక్ష వేస్తారు.
ఉత్తర కొరియాలో రేప్ నిందితులను అక్కడి చట్టాలు కఠినంగా శిక్షిస్తాయి. నేరం చేశాడని రుజువైన వెంటనే నిందితుని తలను తుపాకీతో కాల్చి చంపుతారు. లేదంటే నిందితుడి శరీరంలోని అన్ని అవయవాల్లోకి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. రేప్ చేసిన నిందితులకు రష్యాలో అంత కఠిన శిక్షలు ఏవీ లేవు. మహా అయితే నేరం చిన్నదిగా ఉంటే 3 నుంచి 6 ఏళ్ల జైలు, ఇంకా తీవ్రమైతే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మహిళలను వేధింపులకు గురి చేసినా, లైంగిక దాడికి పాల్పడినా దాన్ని నార్వేలో రేప్ నేరం కిందే పరిగణిస్తారు. నేర తీవ్రతను బట్టి నిందితుడికి 4 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అమెరికాలో స్టేట్ లా, ఫెడరల్ లా అని రెండు రకాల చట్టాలు ఉన్నాయి. అయితే రేప్ చేసిన నిందితులను మాత్రం ఈ రెండు చట్టాలు వదిలిపెట్టవు. అత్యాచారానికి పాల్పడ్డ వారికి కనీసం 30 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. నేరం ఇంకా తీవ్రతరమైతే నిందితుడు ఇక చనిపోయే వరకు జీవితాంతం జైలులో గడపాల్సిందే.
మన దేశంలో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత చట్టాలను కొంత మార్చారు. నిందితులకు ఇప్పుడు 14 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదంటే నేర తీవ్రత ఎక్కువగా ఉంటే మరణ శిక్ష విధిస్తున్నారు. రేప్ నిందితులకు శిక్ష వేయడంలో సౌదీ అరేబియా చట్టాలు అన్నింటి కంటే కఠినంగా ఉన్నాయి. నిందితుడి నేరం రుజువైన వెంటనే అతన్ని బహిరంగంగా ఉరి తీస్తారు.