Over Weight : అధిక బరువు లేదా ఊబకాయం లేదా స్థూలకాయం.. ఎలా పిలిచినా ఈ సమస్య ఒకటే. దీంతో చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. గణాంకాలు చెబుతున్న ప్రకారం ప్రతి 5 మందిలో 2 మంది దీని బారిన పడుతున్నారు. ప్రధానంగా అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగానే చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే బరువు అధికంగా పెరుగుతున్నారని మీ శరీరం మీకు ముందుగానే పలు సూచనలు, సంకేతాలను ఇస్తుంది. అవేమిటంటే..
1. ఒకటి లేదా రెండు నెలల్లో మీ దుస్తులు బిగుతుగా మారాయని అంటే.. మీరు అధికంగా బరువు పెరిగారని అర్థం. కనుక వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నడుం చుట్టు కొలత మారుతుంది. దీంతో దుస్తులు పట్టవు. కాబట్టి ఈ సంకేతం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
2. అధిక బరువు ఉండటం వల్ల కాళ్ల సిరలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది గుండెకు రక్తాన్ని తీసుకురావడానికి పని చేస్తుంది. మీరు బరువు పెరుగుతుంటే సిరల ద్వారా రక్తం సరిగా వెళ్లదు. దీని కారణంగా కాళ్లు, పాదాలలో వాపు వస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల కాళ్ల సిరల్లో గడ్డలు పెరుగుతాయి. బరువు పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తుంటే జాగ్రత్త పడాల్సిందే.
3. చిన్న పని చేసినా అలసి పోతున్నా లేదా మెట్లు ఎక్కలేకపోతున్నా.. మీరు అధికంగా బరువు పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి.
4. అధికంగా బరువు పెరుగుతున్న వారికి శ్వాసకూడా సరిగ్గా ఆడదు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
5. అధికంగా బరువు పెరిగే వారిలో మలబద్దకం సమస్య వస్తుంది. సుఖ విరేచనం అవదు. ఇక స్త్రీలలో అయితే రుతు క్రమం సరిగ్గా ఉండదు.
ఈ లక్షణాలు, సంకేతాలను గుర్తించడం ద్వారా మీరు అధికంగా బరువు పెరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు. దీంతో వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీని వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.