మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా, అందులో చర్యలు సరిగ్గా జరగాలన్నా నిత్యం మనం తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. నీరు మన శరీరంలో పలు ముఖ్యమైన పనులకు ఉపయోగపడుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు, మెటబాలిజం సరిగ్గా ఉండాలన్నా, అధిక బరువు తగ్గాలన్నా నీటిని తగినంత మోతాదులో తాగాలి. చెమట ఎక్కువగా పట్టేవారు లేదా అలాంటి ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో నివాసం ఉండే వారు నీటిని కాస్త ఎక్కువగానే తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం మనం 8 గ్లాసు నీటిని తాగాలని చాలా మందికి తెలుసు, కానీ.. అసలు నీటిని సరిగ్గా ఏయే సమయాల్లో తాగాలి ? ఎలా తాగాలి ? అనే విషయాలు చాలా మందికి తెలియవు. అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది బాటిల్స్‌లో నీటిని పట్టుకుని తాగుతారు. కానీ అది సరైన పద్ధతి కాదు. బాటిల్స్‌కు బదులుగా నీటిని గ్లాస్‌లో పోసుకుని తాగాలి. అలా తాగితేనే మనం నిత్యం తాగాల్సిన నీటి కోటాను పూర్తి చేస్తాం. బాటిల్స్‌లో తాగితే ఎంత తాగుతున్నదీ తెలియదు. దీంతో కొన్ని సందర్భాల్లో ఎక్కువ నీటిని తాగేస్తాం. ఫలితంగా గ్యాస్ సమస్య వస్తుంది. అలాగే నీటిని ఒక్కసారిగా తాగరాదు. టీ, కాఫీ తాగినట్లు సిప్ చేస్తూ తాగాలి. ఇలా తాగితేనే దాహం పూర్తిగా తీరుతుంది. నీటిని తాగామన్న సంతృప్తి కలుగుతుంది.
చాలా మంది నిలబడి నీళ్లను తాగుతారు. అలా చేయడం వల్ల కీళ్ల భాగాల్లో నీరు చేరుతుంది. దీంతో ఆర్థరైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక ఎల్లప్పుడూ కూర్చునే నీటిని తాగాలి. దీంతో కండరాలు, నాడీ మండల వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, కిడ్నీలు నీటిని సరిగ్గా ఉపయోగించుకుంటాయి.
కొందరు ఎప్పుడూ చల్లని నీటిని తాగుతారు. దీంతో జీర్ణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరంలోని భాగాలకు రక్త సరఫరా తగ్గుతుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. కనుక గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగాలి. లేదా గోరు వెచ్చని నీటిని తాగవచ్చు. దీంతో జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు. గ్యాస్, కడుపునొప్పి ఉండవు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి.
కొందరు అవసరం ఉన్నా లేకున్నా పదే పదే నీటిని తాగుతుంటారు. అలా కాదు, ఆయుర్వేద ప్రకారం శరీరానికి అవసరం ఉన్నప్పుడే నీటిని అందివ్వాలి. దాహం అయినప్పుడే ఆ దాహం తీరే వరకు నీటిని తాగాలి. దీంతో శరీరం నీటిని సరిగ్గా వినియోగించుకుంటుంది. లేదంటే అధిక నీటిని బయటకు పంపుతుంది. ఈ క్రమంలో కిడ్నీలపై భారం పడుతుంది.
మూత్రం ఏ రంగు లేకుండా క్లియర్ గా వస్తుంది అంటే మీరు నీటిని సరిగ్గానే తాగుతున్నారని అర్థం. అలా కాకుండా పసుపు రంగులో వస్తే మీరు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని అర్థం. అలాంటి వారు ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. అలాగే నీరు తగినంత తాగకపోతే పెదవులు తడి ఆరిపోయి ఎండిపోయినట్లు అవుతాయి. ఈ సూచనలను గమనించడం ద్వారా నీటిని తగినంత మోతాదులో తాగడం అలవాటు చేసుకోవచ్చు.
ఆయుర్వేద ప్రకారం ఉదయాన్నే పరగడుపునే తగినంత నీటిని తాగాలి. ఒకే మొత్తంగా కాకుండా నెమ్మదిగా నీటిని తాగాలి. దీంతో అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
నీటిని ఏయే సమయాల్లో తాగాలంటే…
నిద్ర లేచిన తరువాత
ఉదయం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ వరకు నీటిని తాగవచ్చు. అందరికీ ఇది వర్తించదు. తాగగలం అనుకున్న వారే తాగాలి. లేదంటే కనీసం 1 గ్లాస్ నీటిని అయినా తాగాలి. దీంతో జీర్ణవ్యవస్థ ఉత్తేజం అవుతుంది. మీరు అల్పాహారం తీసుకునే వరకు జీర్ణాశయంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
భోజనానికి ముందు
భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు 1 గ్లాస్ నీటిని తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. అయితే నీళ్లను తాగి వెంటనే భోజనం చేయరాదు, అలాగే భోజనం చేసిన వెంటనే నీటిని తాగరాదు. కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో ఆమ్లాలు సరిగ్గా పనిచెయ్యవు. తిన్న ఆహారం జీర్ణం కాదు. ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా గ్రహించలేదు.
స్నానం చేసే ముందు
స్నానం చేసే ముందు ఒక గ్లాస్ నీటిని తాగితే బీపీ తగ్గుతుంది. సాధారణంగా స్నానం చేసే సమయంలో బీపీ పెరుగుతుంది. అందుకనే స్నానం చేసేటప్పుడు కొందరికి హార్ట్ ఎటాక్‌ల వంటివి వస్తాయి. దాన్ని నివారించాలంటే స్నానానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగాల్సి ఉంటుంది.
నిద్రకు ఉపక్రమించే ముందు
రోజూ రాత్రి నిద్రించడానికి ఒక గంట ముందు అయినా సరే ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో రాత్రి పూట శరీరంలో ద్రవాల పరిమాణం తగ్గకుండా ఉంటుంది.
ఇక ఈ సమయాల్లో కాకుండా మిగిలిన ఏ సమయంలో అయినా దాహం అనిపిస్తే నీటిని తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగేలా చూసుకోవాలి. కొందరికి దాహం ఎక్కువ అవుతుంది. అలాంటి వారు దాహం తీరే వరకు నీటిని తాగవచ్చు. కానీ ఒకేసారి కాకుండా నెమ్మదిగా తాగడం అలవాటు చేసుకోవాలి.