విటమిన్ సి.. దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థం. ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది. కణజాలం, మృదులాస్థి అభివృద్ధికి, నిర్వహణకు అవసరం అవుతుంది. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. విటమిన్ సి ఉండే పండ్లను, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
1. జలుబు, ఫ్లూ సమస్యలVitaతో బాధపడేవారు విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుంది. జలుబుకు కారణమయ్యే అలర్జీలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది. విటమిన్ సి ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే హైబీపీ నియంత్రణలో ఉంటుంది.
3. ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి.
4. పొట్ట దగ్గర కొవ్వు చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు విటమిన్ సి ఉండే ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో జీవక్రియలు పెరుగుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
5. మన శరీరం కొల్లాజెన్ అనే పదార్థాన్ని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. అందుకు విటమిన్ సి అవసరం అవుతుంది. దీంతో చర్మ సమస్యలు ఉండవు. చర్మంపై ముడతలు తగ్గుతాయి.
విటమిన్ సి మనకు ఎక్కువగా నిమ్మ, ఉసిరి, నారింజ, బత్తాయి, ద్రాక్ష, టమాటాలు, కివీలు, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్ సి లోపం ఏర్పడకుండా ఉంటుంది.