సినిమా గురించి వ్యాపార వ్యవహారాల్లో చెప్పుకోవాలంటే, అటు పూర్తిగా కళ కాదు, ఇటు వ్యాపారం కాదు, అలాగని సినిమా వారు గొప్పగా చెప్పుకునే పరిశ్రమ కూడా కాదు.. ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే “కళాత్మక వ్యాపారం” మరి వ్యాపారం చేయాలంటే (సినిమా తీయాలంటే) పెట్టుబడి కావాలి కదా , అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆసక్తికరమైన ప్రశ్న.. సరే ఇప్పుడు సమాధానం లోకి వద్దాము..సాధారణంగా ఒక నిర్మాత సినిమా నిర్మించే ప్రక్రియలో ముందుగా దర్శకుడితో కథా చర్చలు, బడ్జెట్ మొదలైన వ్యవహారాలు ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో జరుగుతాయి.. కొంచెం అటు ఇటుగా ఒక అంకె అనుకుని దర్శకుడు నిర్మాత కి చెప్తే, ఆ నిర్మాత నిధుల సమీకరణ మొదలుపెడతారు..
కొంత సొంత డబ్బు పెట్టినా, అధిక శాతం(90% వరకూ) ధన సమీకరణ ఫైనాన్షియర్ దగ్గర నుంచే చేస్తారు.. ఇందుకోసం 6% నుంచి వడ్డీ వసూలు చేస్తారు( నేను అనుకోవడం ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు) నాటి రామానాయుడు గారి నుంచి, నేటి దిల్ రాజు, మైత్రి ఎవరైనా సరే సినిమా నిర్మాణానికి నిధులు కావాలంటే ఫైనాన్షియర్లు తప్పనిసరి.. కొంచెం పేరున్న నిర్మాతల దగ్గర అసలు+వడ్డీ వసూలు చేసుకోవడం సులభం, పైగా వారి దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు కనుక వసూలు చేసుకోవడం సులభమే.. అందుకే వారికి తక్కువ వడ్డీ కి అప్పు ఇస్తారు, చిన్న నిర్మాతలకి నిబంధనలు కఠినంగా రూపొందిస్తారు. వారి దగ్గర వసూలు చేసే విధానం కూడా కొంచెం మొరటుగా ఉంటుంది..
సత్య రంగయ్య, శోభన్ బాబు (నటుడు కాదు), నారంగ్, అభిషేక్ అగర్వాల్ ఇలా పెద్ద ఫైనాన్షియర్లు చాలా మందే ఉన్నారు, కానీ ఎక్కువగా బయట ప్రపంచానికి కనపడడానికి ఇష్టపడరు.. వీరిలో నారంగ్ , అగర్వాల్ ఈమధ్యన నిర్మాతలుగా కూడా అరంగేట్రం చేసారు.. కార్పొరేట్ రంగంలో సినిమాలకి ఫైనాన్స్ చేసే సంస్థలు అంటే మన తెలుగు లో తక్కువే అని చెప్పుకోవాలి, బాగా పేరున్న సంస్థ అంటే హైదరాబాద్ కి చెందిన RSecured Finance & Capital వారు. తమిళంలో పరిస్థితి కొంచెం వేరు, అక్కడ ఎక్కువగా సినిమాలకి ఫైనాన్స్ చేసేది, నటుడు/ మంత్రి ఉదయనిధి స్టాలిన్, బ్యాంకులు కూడా ఫైనాన్స్ చేస్తుంటాయి.. ఉదయనిధి కన్నా ముందు కుందు వడ్డీ వారి ఆగడాలు దారుణంగా ఉండేవి అని చెప్పేవారు.. హిందీ సినిమాలు ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ అయిపోయాయి..
ఇప్పుడు తెలుగులో సీనియర్ నిర్మాతలు నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి వారు సినిమాలు తీసినా కూడా ఎక్కువగా చిన్న సినిమాలకి మొగ్గు చూపుతున్నారు, అది కూడా ఒక 5-6 చిన్న నిర్మాతల తో కలిపి సినిమాలు తీస్తున్నారు, ఈ ట్రెండ్ ఎక్కువగా మలయాళం సినిమాల్లో కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడి సినిమాల విజయాల శాతం చాలా తక్కువ.. సినిమా హిట్ అయ్యి డబ్బులు మిగుల్చుకునేవారికన్నా, వడ్డీల మీద చక్రవడ్డీలు కడుతూ బాధపడే నిర్మాతల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.. కనిపించేటంత రంగులమయం కాదు సినిమా అనబడే కళాత్మక వ్యాపారం.