బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో అత్యంత కాస్ట్లీ విడాకులు ఏవో తెలుసా? ఏ బాలీవుడ్ నటుడు ఎక్కువ భరణం ఇచ్చి విడాకులు పొందారో చూద్దాం. సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా.. వాటి గురించి కొన్ని రోజుల పాటు డిస్కషన్ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎందరో సెలబ్రిటీ కపుల్స్ డైవర్స్ తీసుకున్నారు. సమంత- నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య, సైఫ్ అలీ ఖాన్- అమృత సింగ్, అమీర్ ఖాన్- రీనా దత్తా వంటివారెందరో ఈ జాబితాలో ఉన్నారు. అయితే, విడాకుల అనంతరం కోర్టు ఆదేశాలతో భార్యలకు భర్తలు భరణం(Alimony) ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వారి భార్యలకు భరణం ఇచ్చారు. మరి, బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో అత్యంత కాస్ట్లీ విడాకులు ఏవో తెలుసా? ఏ బాలీవుడ్ నటుడు ఎక్కువ భరణం ఇచ్చి విడాకులు పొందారో చూద్దాం.
అమీర్ ఖాన్, రీనా దత్తాల ప్రేమ 1980వ దశకం ప్రారంభంలో మొదలైంది. అమీర్ ఖాన్ తొలి సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్‌లో రీనా దత్తా ఓ సాంగ్‌లో కూడా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. దీంతో క్రమంగా వీరిమధ్య బంధం బలోపేతం అయింది. అమీర్ ఖాన్ (21), రీనా దత్తా(19) ఏళ్ల వయసులోనే 1986లో కోర్టు సమక్షంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఇరా, జునైద్ సంతానం కలిగారు. అయితే, 16 ఏళ్ల తర్వాత ఈ జంట 2002లో విడాకులు తీసుకుంది. నాడు భరణం కింద రీనాకు అమీర్ రూ.50 కోట్లు చెల్లించినట్లు టాక్.
మలైకా ఆరోరా, అర్బాజ్ ఖాన్.. 1998 డిసెంబర్ 12న వివాహం చేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత 2017లో వీరు విడిపోయారు. డైవర్స్ సెటిల్‌మెంట్ కింద మలైకా ఆరోరా రూ.10-15 కోట్లు అందుకున్నట్లు రిపోర్టులు వెల్లడించాయి. మరో ఐకానిక్ బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్- అమృత సింగ్ 1991లో పెళ్లి చేసుకోగా 13 ఏళ్ల పాటు కాపురం చేసి 2004లో విడిపోయారు. వీరి డైవర్స్ సెటిల్‌మెంట్ గురించి సైఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘అమృతకు రూ.5 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అందులో రూ.2.5 కోట్లు ఇచ్చేశా. దీంతోపాటు నా కొడుకు వయసు 18 ఏళ్లు నిండేవరకు ప్రతి నెల ఒక లక్ష రుపాయలు చెల్లిస్తున్నా. మిగతా డబ్బులు కూడా ఇస్తానని నా మాజీ భార్యకు హామీ ఇచ్చా. నేను చచ్చిపోయే లోగా వీటిని చెల్లిస్తా’ అంటూ తన డైవర్స్ గురించి వెల్లడించాడు.
ఫర్హాన్ అక్తర్, అధునా భాబని 17 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2017లో విడిపోయారు. వీరి డైవర్స్ సెటిల్‌మెంట్‌లో భాగంగా.. ఫర్హాన్ వన్ టైమ్ పేమెంట్ చేసేశాడు. అదనంగా, ముంబైలోని 10 వేల చదరపు అడుగుల బంగ్లాను ఆమెకు రాసిచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్- సుషన్నె ఖాన్ జంట 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి హ్రీహాన్, హ్రిధాన్ ఇద్దరు కుమారులు. అయితే, 14 ఏళ్లు కలిసి కాపురం చేసిన అనంతరం 2014లో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పటివరకు ఈ జంట విడాకులే బాలీవుడ్‌లో అత్యంత కాస్ట్‌లీవని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రకారం.. విడాకుల కోసం సుషన్నె ఖాన్ హృతిక్ నుంచి రూ.400 కోట్లు డిమాండ్ చేసిందట. చివరికి, 300 కోట్లకు భరణం సెట్ అయినట్లు అందులో వెల్లడించింది.