నాకు 22 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి అయింది. అప్పుడు నా భర్త వయస్సు 33 ఏళ్లు. ఆయనకు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మొదట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా మేం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్న చిన్న గొడవలు అయినా రాత్రికి మళ్లీ కలివిడిగా ఉండేవాళ్లం. ఎలాంటి కలతలు లేకుండా మా కాపురం హాయిగానే సాగింది. కానీ కాలం తెచ్చిన మార్పో మరొకటో కానీ, మా బంధానికి బీటలు వారడం మొదలైంది. నాకు మొదట్నుంచి అందరితోనూ కలివిడిగా ఉండడం ఇష్టం. స్నేహితులు, బంధువులతో ఎల్లప్పుడూ నవ్వుతూ వారిని నవ్విస్తూ ఉండేదాన్ని. కానీ ఇది మా అత్తకు నచ్చలేదు. అయినా ఆమె కోసం నేను మారలేను కదా.
ఒక రోజు నా భర్త పని నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్ వారు పంపిస్తున్నారు కనుక ఆయనకు మాత్రమే టిక్కెట్లను ఇచ్చారు. నేను కూడా వస్తానని చెప్పా. కేవలం 2 నెలలే కదా, ఎలాగో గడిచిపోతాయి లే, అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకో.. అని నా భర్త అన్నాడు. ఇది నాకు నచ్చలేదు. అతనితో వాదించా. మా పుట్టింటికి వచ్చేశా. మా ఇంట్లో కూడా రోజూ ఇదే విషయంపై ఇంట్లో వాళ్లతో నాకు గొడవలు అయ్యేవి. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు ఉండాలి, ఇప్పటికిప్పుడు పాస్ పోర్టు అంటే ఎలా..? అని నా భర్త అనడంతో వెంటనే పాస్‌పోర్టుకు అప్లై చేసి తీసుకున్నా. నన్ను తీసుకుపోవడం ఆయనకు తప్పేలా లేదు. అప్పుడు మా అత్త కలగజేసుకుని, కేవలం 2 నెలలే కదా, వెళ్లకపోయినా ఫర్వాలేదు, అందరం ఉన్నాం కదా.. అని సర్దిచెప్పబోయింది. అలా అయితే అప్పటి వరకు నేను మా పుట్టింట్లోనే ఉంటానని పట్టుబట్టా. అదే నేను చేసిన తప్పు అని తరువాత అర్థమైంది.
2 నెలల తరువాత నా భర్త వచ్చాడు. ఎన్ని రోజులు అయినా తను నా దగ్గరకు రాలేదు. నన్ను తీసుకెళ్తాడని ఎదురు చూశా. కానీ అతను రాలేదు. ఫైనల్‌గా ఒక రోజు డైవోర్స్ పేపర్లను పంపాడు. నాకు షాక్ తగిలింది. నీతో ఇక జీవితం కొనసాగించలేనంటూ విడాకులు పంపాడు. అంతటి షాక్‌లో ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను అర్థం చేసుకోలేని భర్తతో నేనూ కొనసాగేది లేదని నిర్ణయించుకున్నా. డైవోర్స్‌కు ఓకే చెప్పేశా. నా పెళ్లి జరిగినప్పుడు నా వయస్సు 22, విడాకులు తీసుకునేటప్పుడు నా వయస్సు 23. ఇది ఇంట్లోని నా తల్లిదండ్రులను ఎంతో బాధకు గురి చేసింది. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. మళ్లీ పెళ్లి చేయాలని మా వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. 40-45 ఏళ్లు ఉన్న వారు భార్య చనిపోయి పిల్లలు ఉన్నవారు నన్ను పెళ్లి చేసుకునేందుకు ఓకే చెబుతున్నారు. నాకు అన్నీ అలాంటి సంబంధాలే వస్తున్నాయి. నాపై సమాజం సెకండ్ హ్యాండ్ గా ముద్ర వేసింది.
నేను విడాకులు ఇచ్చిన నా భర్త మాత్రం ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. పైగా ఒక కూతురు కూడా పుట్టింది. కానీ లైఫ్ ఇలా నాశనం అయింది. ఆ రోజు నేను వేసింది తప్పటడుగు అని తరువాత అర్థమైంది. అప్పుడు నా వాళ్లు నాకు తోడుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరూ లేని ఏకాకి అయ్యాను. స్త్రీలు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా కుటుంబ సభ్యులు లేదా భర్త సపోర్ట్ లేకపోతే వారిలో ఏదో ఒక భయం ఉంటుంది. అదే భయం నాలోనూ పెరుగుతోంది. ఏ స్త్రీ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిజం. స్త్రీలు స్వతంత్రంగా బతకగలరని, వారికి ఎలాంటి సహాయం, సపోర్ట్ అవసరం లేదని, సీరియల్స్, సినిమాల్లో చూపిస్తారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి అంతా వేరేగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇది చదివిన స్త్రీలు ఎవరైనా సరే.. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది విడాకులు అనే పెద్ద నిర్ణయం తీసుకోకండి. అది మీ జీవితంపై చెరగని ముద్ర వేస్తుంది. తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు.