సీజన్ మారిందంటే చాలు రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణం మారడం వల్ల జలుబు చాలా తొందరగా వ్యాపిస్తుంది. జలుబు వల్ల ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బడ కారణంగా చికాకు పెరుగుతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ముక్కులోకి గాలి వెళ్ళకుండా ఏదో అడ్డుపడినట్లు భావన. ఐతే దీని తరిమి కొట్టడానికి మార్కెట్లో చాలా మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికంటే మనం ఇంట్లోనే తయారుచేసుకునే ఆయుర్వేద ఔషధం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆవిరి పట్టుకుంటారు. ఆవిరి పట్టుకోవడం వల్ల ముక్కు దిబ్బడ పోతుందన్న మాట నిజమే గానీ, అందులో వేసే పదార్థాలు ఏంటన్నది ఆసక్తికరం. మార్కెట్లో రెడీమేడ్ గా దొరికే వాటిని కాకుండా ఇంట్లో దొరికే వాటితో ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం మనకి కావాల్సిన పదార్థాలు.. 2 టేబుల్ స్పూన్ల వాము, 5 తులసి ఆకులు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని పుదీనా ఆకులు, 500 మిల్లీ లీటర్ల నీళ్ళు.
తయారుచేసే పద్దతి: నీటిని స్టవ్ మీద పెట్టి వేడి చేసి దానిలో మిగతావన్నీ వేసి మరిగే వరకూ అలాగే ఉంచాలి. వాడే పద్దతి.. నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ మీద నుండి తీసివేసి ఒక పది నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. స్టవ్ మీద నుండి దించేముందు మనం వేసిన వస్తువులన్నీ నీటిలో బాగా కలిసిపోయాయో లేదో చూసుకోవాలి. ఈ విధంగా ఒక రోజులో రెండు నుండి మూడు సార్లు చేస్తే ముక్కు దిబ్బడ పూర్తిగా తగ్గిపోతుంది.