అరిజోనాకు చెందిన ఆండీ నార్టన్ వయసు 32. అతడికి ఊహ తెలిసిన నాటి నుంచీ శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యేవి. నిద్రలేమి, ఆస్తమాతో కూడా అతడు సతమతమయ్యేవాడు. దీనికి కారణం ఓ ప్లాస్టిక్ బొమ్మ అన్న విషయం ఇటీవలే బయటపడింది. తన సమస్య ఎలా పరిష్కారమైందీ చెబుతూ అతడు ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టాడు. చిన్నతనంలో లెగో బొమ్మలతో ఆడుకునే సమయంలో పొరపాటున ఓ చిన్న ముక్కను ముక్కులో పెట్టుకున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన తల్లి ట్వీజర్స్‌తో దాన్ని బయటకు తీసిందని చెప్పాడు. ఈ క్రమంలో ముక్కులో ఉన్న బొమ్మ విరిగి కొంత భాగం లోపలే ఉండిపోయినా తన తల్లి గుర్తించలేకపోయిందని అన్నాడు. నాటి నుంచీ 26 ఏళ్ల పాటు ముక్కులో ఉండిపోయిన బొమ్మ కారణంగా రకరకాల అనారోగ్యాల పాలయ్యానని చెప్పుకొచ్చాడు.
తన ఇబ్బందులు గమనించిన డాక్టర్ వేడి నీటితో తల స్నానం చేసే సందర్భంగా ముక్కు చీదితే సమస్య నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పినట్టు ఆండీ వివరించాడు. డాక్టర్ సూచన మేరకు ఓ రోజు స్నానం చేస్తూ గట్టిగా చీదడంతో ముక్కలోని లెగో బొమ్మ ముక్క బయటకు వచ్చిందన్నాడు. అది చూసి షాకైపోయానని, ఇంతకాలం పడ్డ ఇబ్బందులకు ఈ ప్లాస్టిక్ ముక్క కారణమని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు.
కాగా, ఈ ఉదంతానికి నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఓ రేంజ్‌లో లైక్స్ కామెంట్స్ వచ్చాయి. చిన్నతనంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారి తీస్తాయని అన్నారు. అతడి ఉదంతం వింటుంటేనే తన గుండెలో రైళ్లు పరిగెత్తాయని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.