జలుబుతో బాధపడుతుంటే తేనె కలిపిన నిమ్మరసం తీసుకోవాలి. జలుబుతో బాధపడుతూ ముక్కు పట్టేసినట్టుంటే మరిగే నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుముఖం పట్టడమే కాకుండా యాంటిబయాటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు తగ్గాలంటే టీ స్పూను శొంఠి, టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని ఒక్కో కప్పు చొప్పున రోజుకు మూడు, నాలుగు సార్లు తాగాలి. జలుబు ఎక్కువై గాలి పీల్చుతున్నప్పుడు ఛాతీలో నుండి శబ్దం వస్తున్నట్లయితే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లిరేకులను చిదిమి వేసుకొని తాగాలి. ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
రోజూ ఒక స్పూను త్రిఫలచూర్ణాన్ని తీసుకుంటే తిన్న ఆహారంలోని పోషకాలు వ్యర్ధం కాకుండా ఒంటబట్టేలా చేస్తుంది. తలపోటు రావడానికి ఒక్కోసారి కళ్ళ కండరాలు ఎక్కువ శ్రమకు గురికావడం కూడా కారణం కావచ్చు. టెలివిజన్‌కి కంటికి కనీసం 15 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. పుస్తకం కంటికి రెండు అడుగుల దూరం లో ఉంచి చూడాలి. కంప్యూటర్ మానిటర్‌కి, కంటికి వీలైనంత దూరం ఉండాలి. ఇలా చేయడం వల్ల కళ్లకి శ్రమ ఎక్కువుగా ఉండదు. ప్రశాంతంగా ఉండి తలనొప్పి రావడం తగ్గుతుంది. తలనొప్పికి, కీటకాలు కుట్టిన చోట గాయం వల్ల కలిగే నొప్పికి ఆముదం రాస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారికి ఐస్ మంచి మందని వైద్యులు చెపుతున్నారు. ప్లాస్టిక్ కవర్‌లో ఐస్ ముక్కల్ని వేసి దానిని తల, నుదురుల మీద పెట్టుకోవాలి.
తాగే నీటిలో సాజీరాను వేసి పది నిముషాల పాటు వేడి చేసి తాగితే పొట్టలో నులి పురుగులు, చెడు శ్వాస సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ పేషెంట్లు తాగే నీటిలో జామ ఆకులను వేసుకుంటే మంచిది. ఒక రోజుకు అవసరమైనన్ని నీటిలో పది జామఆకులను వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నుంచి ఆ నీటిని తాగాలి. డయేరియా లక్షణాలు పూర్తిగా తగ్గేవరకు గంటకు కనీసం పావులీటరుకు తగ్గకుండా ద్రవాలను తీసుకోవాలి. డయేరియా అదుపులోకి వచ్చిన మర్నాటి నుంచి మామూలుగా ఆహారం తీసుకోవచ్చు. అయితే మసాలాలు, నూనెలతో వండిన వాటిని పూర్తిగా మినహాయించాలి. డయేరియా వచ్చినప్పుడు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది. ఇవి త్వరగా జీర్ణం కావు. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం లేదా గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడంలాంటి ఉదరసంబంధ సమస్యలకు పావు టీస్పూను మిరియాలపొడిని మజ్జిగలో వేసుకొని తాగి చూడండి.
తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. దీని ముదురు ఆకులను పొడి చేసి అందుబాటులో ఉంచుకోవాలి. ఆకుల రసం కూడా శ్రేష్టమైనదే.